NAGARJUNA SAGAR TOURIST ATTRACTION: నాగార్జునసాగర్ గత ఐదు సంవత్సరాలలో పర్యాటకంగా వెనకబడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పర్యాటక ఆదాయం పూర్తిగా తెలంగాణ ప్రాంతానికే వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నాగార్జునసాగర్ ప్రాంతానికి పర్యాటక కళ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.25 కోట్లు మంజూరయ్యేలా చొరవ చూపింది. పైగా ఈ నిధులను సంవత్సరంలోగా వినియోగించి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా విధించింది. దీంతో పనులు అనుకున్న సమయానికి పూర్తయి పర్యాటకులకు నాగార్జునసాగర్ కనువిందు చేయనుంది.
చేయబోయే పనులు ఇవే: బౌద్ధ ఉద్యానాలు, బౌద్ధ చిహ్నాల కట్టడాలు, రెస్టారెంట్లు, బయోటాయ్‌లెట్స్, సీసీ కెమెరాలు, ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టం, 3డీ హోలోగ్రామ్ సిస్టమ్, హరిత ఉద్యానాలు, పర్యాటక వర్క్‌షాప్‌లు, ట్రైనింగ్ ఇవ్వనున్నారు. తద్వారా నాగార్జునసాగర్‌లో బౌద్ధ వారసత్వం, సాంస్కృతిక చిహ్నాలను సుసంపన్నం చేస్తూ పర్యాటకంగా ఆదాయం పెంచడాన్ని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.
మాచర్ల పరిసర ప్రాంతాల్లోనే పలు దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఎత్తిపోతల జలపాతం, అనుపు రేవు, నాగార్జునసాగర్ డ్యామ్, నాగార్జునకొండ, మినీ ఎయిర్‌పోర్టు. ఈ ఐదింటిని ఒకరోజులోనే చూసి రావచ్చు. ఉదయం 9 గంటలకు బోటుపై నాగార్జునకొండకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వచ్చిన తరువాత, అక్కడ నుంచి అనుపు రేవు, ఎత్తిపోతల, మినీ ఎయిర్‌పోర్టు చూడవచ్చు. అనుపు రేవు వద్ద పలు మూవీల షూటింగ్ చేశారు. ఇవన్నీ మాచర్ల పట్టణానికి 20 కిలోమీటర్ల లోపే ఉన్నాయి.
అనుపు రేవు వద్ద బౌద్ధ మ్యూజియంతో పాటు అప్పటి ఆనవాళ్లు ఉన్నాయి. ఎత్తిపోతల జలపాతానికి వర్షాకాలంలో పర్యాటకులు వేలసంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే అనుపురేవు, ఎత్తిపోతల జలపాతం వద్ద పర్యాటకులు ఒకటిరెండురోజులు ఉండేందుకు సదుపాయాలు లేవు. వారాంతం, సెలవు రోజుల్లో పర్యాటకులు వస్తున్నా, ఉండేందుకు సరైన హోటళ్లు లేవు.
మాచర్లకు మహర్దశ: స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద నాగార్జునసాగర్ అభివృద్ధి చెందితే సమీపంలోని మాచర్ల రూపురేఖలు సైతం మారిపోతాయి. ఇప్పటికే మాచర్ల పట్టణంలో బైపాస్ పూర్తి కావస్తోంది. దీనికితోడు సాగర్ అభివృద్ధి చెందితే, మాచర్లలో పర్యాటకుల కోసం కొత్త హోటళ్లు వస్తాయి. దీని ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుంది. మాచర్ల వాసులంతా ఎక్కువగా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తుంటారు. పర్యాటకంగా ప్రాంతం అభివృద్ధి చెందితే సొంతూరులోనే ఉంటూ స్థానికంగా ఉపాధి పొందవచ్చు. పర్యాటక కార్పొరేషన్ వారు త్వరగా పనులు పట్టాలెక్కించి, గడువులోగా పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తే అటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇటు స్థానికులకు సైతం ఉపాధి లభిస్తుంది.
ఆధునిక దేవాలయానికి 69 ఏళ్లు - రాతి కట్టడాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్
పర్యాటకులకు గుడ్‌న్యూస్ - నాగార్జునసాగర్ టూ శ్రీశైలం లాంచీ జర్నీ స్టార్ట్