Mylavaram Murder Case Mystery: కన్నబిడ్డలను కడతేర్చి, తానూ ఆత్యహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి పరారైన కర్కశ తండ్రి రవిశంకర్. అతడు అల్లిన కథ బెడిసికొట్టింది. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. విశాఖపట్నంలో తలదాచుకున్న అతడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో అంగీకరించినట్లు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి ఘటన ఈనెల 12వ తేదీన వెలుగులోకి వచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే ?
లక్ష్మిహిరణ్య (9), లీలాసాయి (7)లను రవిశంకర్ చంపి ఉంటాడని పోలీసులు అనుమానించారు. ఈ నెల 8వ తేదీ అతని పుట్టినరోజు కావడంతో, ఆరోజు ఉదయం భార్యతో మాట్లాడాక, ఇంటికి తాళం వేసి, ఫోన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. రవిశంకర్ తండ్రి లక్ష్మిపతి ఈనెల 12న ఇంటికి వచ్చాడు. తాళం వేసి ఉన్న గది నుంచి దుర్వాసన రావటాన్ని గుర్తించాడు.
లోపలికి వెళ్లి చూడగా, చిన్నారులు ఇద్దరూ మంచంపై విగతజీవులై పడిఉన్నారు. అక్కడ రవిశంకర్ రాసిన రెండు పేజీల లేఖ పోలీసులు గుర్తించారు. ఫోన్ చివరి సిగ్నల్ ఇబ్రహీంపట్నంలో కృష్ణా నది వద్ద వచ్చింది. దీంతో అతని కోసం ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది రెండు రోజుల పాటు గాలించినా అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో ఇంకా బతికే ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు నిఘా పెట్టడంతో ఎట్టకేలకు పట్టుబడ్డాడు.
విశాఖలో తలదాచుకుంటున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు గురువారం రాత్రే ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. సింహాచలం అప్పన్న ఆలయంలో ఉండగా చాకచక్యంగా అదుపులోకి తీసుకుని, శుక్రవారం మైలవరం తెచ్చి, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.
మూడు నెలల కిందటే పక్కా ప్లాన్‌తో: ఈనెల 8న రవిశంకర్ చిన్నారులను చంపిన తర్వాత రాత్రికి ఇబ్రహీంపట్నం చేరుకుని, అక్కడే ఫోన్ సిమ్ పడేసి విశాఖపట్నం పారిపోయినట్లు తెలిసింది. గతంలో పలుచోట్ల హోటళ్లలో పనిచేసిన అనుభవం ఉండడంతో ఈ 12 రోజులు విశాఖలో పనిచేసినట్లు సమాచారం. అక్కడే కొత్త సిమ్ తీసుకుని ఫోన్లు చేస్తూ దొరికిపోయాడు. అతడి నుంచి పోలీసులు వివరాలను రాబడుతున్నారు. తానే బిడ్డల్ని చంపినట్లు ఒప్పుకున్నాడు. అచ్చం కరుడుగట్టిన నేరస్థుడిలా వ్యవహరించాడు.
భార్యపై అనుమానం - బిడ్డల ప్రాణాలు తీశాడు: భార్యపై అనుమానంతో తరుచూ ఇంట్లో గొడవపడేవాడని తెలిసింది. అది బిడ్డలను చంపే వరకు వెళ్లింది. ఆమె ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లిన తర్వాత ప్లాన్‌ను అమలు చేశాడు. దీనికి మూడు నెలల నుంచే ప్లాన్ రచించినట్లు విచారణలో పోలీసులకు వెల్లడించాడు.
అప్పటి నుంచి రవిశంకర్ గడ్డం పెంచుతున్నాడు. ఇద్దరి పిల్లలను చంపిన తర్వాత విశాఖపట్నం వెళ్లి అక్కడ గడ్డం తీసేసినట్లు ఒప్పుకున్నాడు. రవిశంకరే పిల్లలను చంపినట్లు తేలడంతో పోలీసులు హత్య కేసుగా మార్చనున్నట్లుగా తెలిసింది. తొలుత అనుమానాస్పద మృతిగా మైలవరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సాంకేతిక ఉచ్చులో చిక్కాడు: రవిశంకర్ ఆచూకీ కోసం పోలీసులు టెక్నాలజీపై ఎక్కువగా దృష్టి సారించారు. వారు బ్యాంకు ఖాతా లావాదేవీలపై దృష్టి పెట్టారు. అతని పేరు మీద ఖాతా లేదనీ, తల్లి బ్యాంకు ఖాతానే ఉపయోగిస్తునట్లు తేలింది. ఆ లావాదేవీలు కూడా ఈ నెల 6వ తేదీ వరకు జరిగాయని గుర్తించారు. అతడు ఎటువంటి యూపీఐ చెల్లింపులు చేయలేదని తేలింది. ఒకవేళ బతికి ఉంటే, కొత్త సిమ్ తీసుకున్నాడా? అనే కోణంలో నిఘా పెట్టారు.
ఎక్కడా పాత ఫోన్ కానీ, ఆ సిమ్ కానీ వాడడం లేదని తెలిసింది. పోలీసులు ప్రయత్నాలు ఫలించాయి. అతడు తన పేరు మీదే కొత్త సిమ్ తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో కొత్త నెంబర్‌కు సంబంధించి సీడీఆర్ (కాల్ డీటెయిల్ రికార్డు), సెల్ టవర్ లొకేషన్ వివరాలను విశ్లేషించారు. అతడు మైలవరంలో ఒకరికి కాల్ చేసినట్లు గుర్తించారు. విశాఖపట్నంలో ఉన్నట్లు తేలింది. మైలవరం నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక బృందాన్ని పంపించి అదుపులోకి తీసుకున్నారు.
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - మరొకరితో సన్నిహితంగా ఉండటమే కారణం!
పల్నాడు జిల్లా డబుల్ మర్డర్ కేసు - సర్పంచిని చేస్తామని చంపించేశారు!