MRO Arrest For Fake Land Documents in Suryapet : భూ రెవెన్యూ దస్త్రాలకు ఆధారమైన అక్రమ పహాణీలను సృష్టించి లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో తహసీల్దార్, ఇద్దరు ఆర్ఐలతో పాటు మరో నలుగురు వ్యక్తులు అరెస్టయిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మోతె మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ఈ అక్రమ వ్యవహారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తనిఖీలో వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ప్రస్తుతం ఎమ్మార్వో శ్రీకాంత్ ఇటీవల కాలంలో పహాణీల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మార్వో సంఘమిత్ర, ఆర్ఐలు నిర్మలా దేవి, మన్సూర్ అలీ, కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజు, మీసేవ నిర్వాహకుడు మల్లేష్ నకిలీ పహాణీలు, పాస్ పుస్తకాలు సృష్టించిన వీఆర్వోలకు సహాయకుడిగా పనిచేసిన కొండలరావు రావిపాడులో జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు కోట స్టాలిన్ కుమార్ రెడ్డిని ఆదివారం అరెస్ట్ చేశారు. వీరిని న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ కేసులో మొత్తం 21 మందిపై కేసు నమోదు అయినట్లు వివరించారు. ఇందులో మధ్యవర్తిగా ఓ విలేకరితో పాటు 11 మంది రైతులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఆర్ఐ అజయ్ కుమార్ గత వీఆర్వో వెంకటేశ్వర్లు, విలేకరి స్టాలిన్ రైతులు పరార్‌లో ఉన్నట్లు తెలిపారు.
మీ సేవా కేంద్రంగా పహాణీలు : ధరణి పోర్టల్లో నమోదు కాని మోతె మండల పరిధిలోని రైతుల వ్యవసాయ భూములను టీఎం-33 మాడ్యూల్ ద్వారా అప్డేట్ చేసేందుకు అక్రమ వ్యవహారానికి తెరలేపారు. ఇందుకు మోతెలోని మీసేవా కేంద్రం వేదికైంది. మాడ్యూల్ ద్వారా పహాణీలో నమోదు కానీ భూములను, పహాణీలు ట్యాంపరింగ్ చేసి ధరణి పోర్టల్లో నమోదు చేయిస్తామని రైతులకు చెప్పారు.
పాత పహాణీలతో నకిలీ పాస్ పుస్తకాలు : ఇందుకు గతంలో వీఆర్వోగా పని చేసిన వెంకటేశ్వర్లు, వీఆర్వోలకు సహాయకుడు కొండలరావు ఇంకా పలువురు సహకరించారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. మిస్సింగ్‌లో ఉన్న తమ భూములు తమ పేరిట రిజిస్టర్ అవుతాయని ఆశతో పెద్ద మొత్తంలో సొమ్ములు ఇచ్చేందుకు రైతులు వెనుకాడలేదు. దీంతో పాటు పహాణీ కాగితాలను సమకూర్చుకుని నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేశారు. వీటిని రెవెన్యూ అధికారి, ఆర్ఐలు ధ్రువీకరించి వాటి సహాయంతో ధరణి పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఇవి కలెక్టర్ లాగిన్‌కి వెళ్లగా దస్త్రాలపై అనుమానంతో పలుమార్లు తిప్పి పంపారు. పంపిన ప్రతిసారి అందుకు అవసరమైన ధ్రువపత్రాలను అనుసంధానించి పంపారు. దీనిపై అనుమానంతో కలెక్టర్ రంగంలోకి దిగారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిర్యాదు : ఈనెల 4న ఆయన ఆర్డీవోతో కలిసి స్వయంగా తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేశారు. మొత్తం 11 ఫైళ్లలో పహాణీలు ట్యాంపరింగ్ చేసినట్లు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుత తహసీల్దార్ మోతె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టిన ఎస్సై యాదవేందర్ రెడ్డి 21 మందిపై కేసు నమోదు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
'స్వామి భూమినీ వదల్లేదు' : దేవుడి భూమిని స్వాహా చేసి వెంచర్లు
బఫర్ జోన్, ఎఫ్టీఎల్ భూములను ఆక్రమించారు - రైతు బంధు తీసుకున్నారు - ఎక్కడంటే?