Mother Killed Daughter in Tirupati District : ఎస్సీ యువకుడిని ప్రేమించిన కుమార్తెను నిలువరించే ప్రయత్నం చేసి ఆమె విఫలమైంది. ఆ యువకుడే తన కుమార్తెను వేధిస్తున్నాడని చెప్పి పోక్సో కేసు పెట్టి జైలుకు పంపింది. విడుదలై వచ్చిన ఆ యువకుడి వద్దకు మళ్లీ వెళుతున్న కుమార్తె ఊపిరి తీసిన తల్లి ఉదంతమిది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (16) సమీపంలోని ఓ గ్రామ హరిజనవాడకు చెందిన యువకుడిని ప్రేమించింది. కుమార్తె గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న తల్లి అబార్షన్ చేయించింది. ఇకనైనా ఆ యువకుడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.
మళ్లీ వారు కలిసి తిరగడంతో బాలికను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై పోక్సో కేసు పెట్టిన పోలీసులు ఆ యువకుడిని చిత్తూరు జైలుకు పంపారు. ఆ సమయంలోనూ బాలిక రెండుసార్లు జైలు వద్దకు వెళ్లి యువకుడిని కలిసింది. కొన్ని నెలల క్రితం యువకుడు విడుదలయ్యాడు. దీంతో మళ్లీ వారి మధ్య సంబంధం కొనసాగింది.
ఊపిరి తీసి విధులకు వెళ్లి : జైలు నుంచి బయటకు వచ్చిన యువకుడితో కుమార్తె కలిసి తిరుగుతోందని గుర్తించిన తల్లి బాలికకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. బాలిక అమ్మమ్మ, మేనమామ కూడా అతనితో వెళ్లవద్దని ఒప్పించే ప్రయత్నం చేశారు. అతనే కావాలని బాలిక భీష్మించడంతో వారు వెళ్లిపోయారు. తన నుంచి వేరుగా ఉంటూ పక్క వీధిలో ఉంటున్న భర్తకు విషయం చెప్పి కుమార్తెను ఒప్పించాలని ఆమె ప్రయత్నించింది. అదే సమయంలో వారం క్రితం కుమార్తె ఫోన్ తీసుకుని బయటకు వెళ్తుండగా తల్లి గమనించి కేకలు వేస్తూ కొట్టింది. బాలిక ప్రతిఘటించడంతో వెనుక నుంచి రెండు చేతులతో నోరు, ముక్కు అదిమి పట్టడంతో కొద్దిసేపటికి బాలిక కింద పడిపోయింది.
మృతి చెందిన విషయాన్ని గుర్తించి ఇంటికి తాళాలు వేసుకుని పారిశుద్ధ్య కార్మికురాలిగా తాను పనిచేస్తున్న తిరుమలకు వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం భర్తకు ఫోన్ చేసి పాఠశాలకు పంపేందుకు కుమార్తెను నిద్ర లేపమని ఇంటికి పంపింది. అతను ఇంటికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను గమనించి బంధువులకు సమాచారం ఇచ్చారు. తిరుమల నుంచి వచ్చిన తల్లి బంధువులతో కలిసి ఆటోలో మృతదేహాన్ని మధ్యాహ్నం వంకలోకి తీసుకెళ్లి దహనం చేశారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం వెలుగులోకి రావడంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమగ్ర విచారణ చేయించారు. దీంతో పరువు హత్యకు సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అత్తింటి అరాచకం - అదనపు కట్నం కోసం వివాహిత హత్య!
ఇష్టంలేని పని చేసిన కుమార్తె - ఉరితాడు ఇచ్చి, చెట్టు చూపించిన తండ్రి