బిడ్డా నువ్వు లేని ఈ లోకంలో నేనుండలేను - నీ వెంటే నేనూ
మూడు రోజుల కిందట రైలు కిందపడి కుమారుడి మృతి - తట్టుకోలేక తల్లి బలవన్మరణం

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 16, 2025 at 10:26 PM IST
Mother Commits Death at Losing Son : ఉన్నది ఒక్కటే జీవితం. కానీ నేటి కాలంలో ఒక్కక్షణం ఒకే ఒక్కక్షణంలో తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఎన్నో జీవితాల్ని తలకిందులు చేస్తున్నాయి. అప్పటి వరకు, ఆ క్షణం ముందు వరకు మనతో, మన మధ్యనే ఉంటున్న వారు శాశ్వతంగా మన మధ్య నుంచి దూరమైపోయారనే మాటే కుటుంబాల్లో పిడుగుపాటవుతోంది. బలవనర్మణాలు కన్నీటి చారికల తడి ఆరనివ్వడం లేదు. వాటి గాయాలు మానడం లేదు. బాధిత కుటుంబాలు కుదుట పడడం లేదు.
ఒక్కగానొక్క కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచింది ఆ తల్లి. బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలని కలలు కనింది. కష్టపడి పనిచేసి డిప్లొమా వరకు చదివించింది. కానీ అనుకోని రీతిలో కుమారుడు మూడు రోజుల కిందట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నపేగు దూరం కావడంతో ఆ మాతృమూర్తి తట్టుకోలేకపోయింది. నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేనంటూ ఆమె కూడా రైలు కిందపడి తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
Woman Died in Tadipatri : ఇందుకు సంబంధించి రైల్వే ఎస్సై నాగప్ప తెలిపిన మేరకు వివరాల మేరకు తాడిపత్రి పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన శైలజ(47), సురేంద్రబాబు దంపతుల కుమారుడు శ్రీచరణ్. అతను డిప్లొమా వరకు చదివాడు. అయితే ఇందులో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. తల్లి శైలజ ఓ ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా, తండ్రి సురేంద్రబాబు కూలి పనులు చేసేవారు. శ్రీచరణ్ తమ బంధువుల యువతిని ప్రేమించాడు. కానీ ఇరువురి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
మూడు రోజుల కిందట శ్రీచరణ్ ధర్మవరం రైల్వే పరిధిలోని ప్రసన్నాయపల్లి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి తీవ్ర మనోవేదనకు గురైంది. కుమారుడు దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. శనివారం ఉదయం తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డులో ఉన్న కోల్డ్ స్టోరేజీ సమీపంలో రైలుకింద పడి శైలజ బలవన్మరణానికి పాల్పడిందని ఎస్సై నాగప్ప తెలిపారు. మృతురాలి భర్త సురేంద్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రోజుల వ్యవధిలో తల్లి, కుమారుడి ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.
'రూ.50లక్షలు మోసపోయా- ఎవరికీ చెప్పే ధైర్యం లేదు'- ఇంట్లోని నలుగురూ మృతి!

