A poor family waiting for help : తోటి పిల్లలతో కలిసి ఆనందంగా ఆడుకోవాల్సిన వయసు ఆ పసిపాపది. కానీ విధి మాత్రం ఆమెపై చిన్నచూపు చూసింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే ఆ బాలిక కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోవడం ప్రారంభమైంది. మరికొన్నాళ్లకి పూర్తిగా కోమాలోకి వెళ్లింది. భర్త చనిపోవడంతో కుటుంబ భారాన్నంతా నెట్టుకొస్తున్న తల్లి తన కుమార్తె పరిస్థితి చూసి తీవ్ర మనోవేధనకు గురవుతోంది. 'తన బిడ్డ అమ్మా అనలేదు ఆకలేసినా చెప్పలేదని' ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తుంది.
వివరాల్లోకి వెళితే : నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నందికొండ మున్సిపల్ పరిధిలో నివాసం ఉంటున్న సిద్ద్వంతి భర్త రెండున్నరేళ్ల క్రితం మరణించారు. అప్పట్నుంచి ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు పుట్టింట్లోనే నివాసం ఉంటోంది. రెండేళ్ల కిందట చిన్న కుమార్తె హారిక ఇంటి ఎదుట ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయడంతో గాయాలయ్యాయి. అప్పట్లో నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ హాస్పిటల్ చికిత్స చేయించారు. ‘2వ డోసు కుక్కకాటు టీకా వేసిన అనంతరం హారిక వారం పాటు తీవ్ర జ్వరంతో బాధపడింది. జ్వరం ఉన్నప్పుడే 3 డోసు టీకా కూడా ఇచ్చారు. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో కమలా నెహ్రూ ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు.
అమ్మా అనలేదు ఆకలేసినా చెప్పలేదు : అక్కడ చికిత్స పొందుతున్నప్పుడే కుమార్తె చేతులు, కాళ్లు స్పర్శ కోల్పోవడం ఆరంభమైంది. అక్కడి డాక్టర్లు తర్వాత నిలోఫర్‌కు పంపించారు. తర్వాత బాలిక కొన్నాళ్లకే పూర్తిగా కోమాలోకి వెళ్లింది. ఒకటిన్నర సంవత్సరం నుంచి నల్గొండ, హైదరాబాద్ ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది.
"నా కుమార్తె ఉలుకుపలుకు లేకుండా ఉంది. అమ్మా అనలేదు ఆకలేసినప్పటికీ చెప్పలేదు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న నేను ఇప్పటికే వైద్యం కోసం రూ.లక్షల్లో ఖర్చు చేశా. కదల్లేని బిడ్డ అన్ని అవసరాలు నేనే తీర్చాల్సి రావడం వల్ల ఏ పనికీ వెళ్లలేని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి నా కుమార్తె చికిత్సకు సహకరిస్తే రుణపడి ఉంటాను" - సిద్ద్వంతి, బాలిక తల్లి
కిందపడిన చిన్నారి ఆసుపత్రికే పరిమితం - ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు
ఇద్దరు చిన్నారులకు అరుదైన వ్యాధి - వైద్యానికి రూ.32 కోట్లు - ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు