Musi Riverfront Development Project : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు పట్టాలు ఎక్కేందుకు మరికొన్నాళ్లు అలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు నుంచి నిధుల కోసం పంపిన నివేదికపై కేంద్ర ఆర్థిక శాఖ మరో మూడు కొర్రీలు పెట్టింది. డీపీఆర్‌తో పాటు పర్యావరణ అనుమతి, ప్రైవేట్ పెట్టుబడుల అనుమతిపై మరిన్ని వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొనే రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. సుమారు ఆర్నెల్ల కిందటే రుణం పొందేందుకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా, విదేశీ రుణాలను అనుమతించే ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త కొర్రీలు పెట్టినట్లు తెలిసింది. గతంలో ప్రపంచ బ్యాంకు రుణం కోసం సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే డీపీఆర్‌లు సాంకేతికంగా అనుమతి పొందాలని పేర్కొంది. తాజాగా డీపీఆర్‌తో పాటు పర్యావరణ అనుమతి, ప్రైవేట్ పెట్టుబడుల సమీకరణ గురించి విదేశీ రుణం పొందడానికి అనుమతించే ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విభాగం ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ప్రపంచబ్యాంకు రుణం పొందడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
రూ.4,100 కోట్ల రుణం ఇస్తే చాలు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి అందించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకోవాలంటే కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాలి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రపంచబ్యాంకు రుణం కోసం పంపిన ప్రాథమిక నివేదికలో మూసీ నదిని పునరుజ్జీవం చేసి ఆర్థికంగా, పర్యాటక వృద్ధికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని పేర్కొంది.
హైదరాబాద్ నగరం మధ్యలో నది ప్రవహిస్తోందని, పునరుజ్జీవం చేయడం ద్వారా జీవవైవిధ్యం పెరగడం సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పెందుకు తోడ్పడుతుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో దోహదపడుతుందని, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపడతామని, 2030 డిసెంబరులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యమని తెలిపింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు రూ.5863 కోట్లు ఖర్చవుతుందని, అందులో రూ.4100 కోట్లు రుణంగా ఇస్తే, మిగిలిన రూ.1763 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. ఫీజిబిలిటీ అధ్యయనం జరిగిందని వివరించింది.
4 ప్రధానాంశాలు : ఆ ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి సంబంధించి 4 ప్రధానాంశాలు చేపట్టాల్సి ఉందని పేర్కొంది. మురుగునీటి శుద్ధీకరణ, వరద నీరు సవ్యంగా వెళ్లేలా చర్యలు, వర్షపు నీరు - మురుగు నీరు కలిసి వెళ్లకుండా చర్యలు, ల్యాండ్ స్కేప్ డెవలప్‌మెంట్ ఇందులో ఉన్నాయని వివరించింది. ఈ మేరకు అనుమతులు, పునరావాసానికి ప్రాథమిక నివేదికను కేంద్ర గృహ-పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి, ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే అదనంగా వివరాలు కోరింది. వాటిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది.ఆ నివేదికను పరిశీలించిన ఆర్థిక మంత్రిత్వశాఖలోని విదేశీ రుణాల విభాగం మళ్లీ కొర్రీలు వేసి తిప్పి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మూసీని మూసేస్తున్నారు! - నది ఒడ్డునే 38 అంతస్తుల భారీ నిర్మాణం
రెండేళ్లలో మురుగు రహిత మూసీ నది - ప్రణాళిక సిద్ధం చేసిన ఎంఆర్‌డీసీఎల్