Ganta Post on Flight Services : విశాఖపట్నం నుంచి విజయవాడకు పలు విమాన సర్వీసులు రద్దుకావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూ ఫేస్‌బుక్‌లో తన పోస్టును కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ట్యాగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి పరిపాలన రాజధాని అమరావతి చేరుకోవాలంటే తెలంగాణలోని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు తన స్వీయ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) April 15, 2025
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి… pic.twitter.com/kDMWFyjs9I
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన తాను విమానంలో హైదరాబాద్ విమానశ్రయానికి చేరుకున్నానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కోసం విశాఖ నుంచి బయల్దేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా తన లాగే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకున్నారని పేర్కొన్నారు.
విశాఖ-విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమాన సర్వీసులు రద్దు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గంటా శ్రీనివాసరావు వివరించారు. దురదృష్టవశాత్తూ ఇవాళ మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేదని చెప్పారు. దీంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇదీ విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు తన పోస్ట్‌ను ట్యాగ్ చేశారు. దీంతో పాటు తాను రెండు విమానాల్లో ప్రయాణించేందుకు తీసుకున్న టిక్కెట్లను సైతం గంటా షేర్ చేశారు.