Miss World Title Winners From Hyderabad : ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ అతిథ్యం ఇస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుందరీమణులు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకునేందుకు హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టారు. ఫ్యాషన్ ప్రపంచమే ఈ నగరంవైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో మన వారు ఎవరైనా ఈ టైటిల్ గెల్చుకున్నారా? అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మన హైదరాబాద్ నుంచే ముగ్గురు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ విజేతలున్నారని మీకు తెలుసా? వారి విజయాలు హైదరాబాద్‌లో ఫ్యాషన్ పరిశ్రమ విస్తరణకు దోహదం చేసింది. ఆ తరువాతే ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ఫ్యాషన్ టూర్ల రాక ప్రారంభమైంది.

రికార్టుల అందాల సుందరి : ఆంగ్లో ఇండియన్ డయానా హెడెన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. 1997లో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచి, అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఇప్పటికీ కొన్ని రికార్డులు ఆమె పేరిట అలాగే ఉన్నాయి. ఆ సంవత్సరం జరిగిన పోటీల్లో డయానా మిస్ వరల్డ్ టైటిల్‌తో పాటూ మిస్ వరల్డ్ ఆసియా అండ్ ఓషియానా, మిస్ ఫొటోజెనిక్, స్పెక్టాక్యుల్ స్విమ్మర్ సబ్ టైటిల్స్ గెల్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో పోటీలు జరిగినా ఒకేసారి ఇన్ని టైటిల్స్ ఎవరూ గెలుచుకోలేదు. డయానా సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుకుంది. 13 ఏళ్లకే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పని చేయడం ప్రారంభించారు. అప్పుడే మోడలింగ్‌లోనూ అడుగు పెట్టింది. 23 ఏళ్ల వయసులో ఫెమినా మిస్ ఇండియా 1997లో రెండో స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెల్చుకుంది. 86 మందిని వెనక్కి నెట్టి టైటిల్ దక్కించుకుంది. మిస్ వరల్డ్ 2005కి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

మొదటి భారతీయ మహిళ : ప్రపంచ అందాల పోటీల్లో తొలి టైటిల్ గెల్చుకున్న భారతీయ మహిళగా సుస్మితాసేన్ అరుదైన ఖ్యాతిని గడించింది. 1994లో మొదటిసారి భారత్ మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెల్చుకుంది. హైదరాబాద్‌లోని బెంగాలి కుటుంబంలో ఈమె జన్మించింది. ఆ రకంగా ఆమెకు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది.

ఒకే సంవత్సరంలో మూడు టైటిళ్లు : డయానా తరువాత దియా మిర్జా హైదరాబాద్ నుంచి ఫ్యాషన్ రంగంలో ఎక్కువ ప్రభావం చూపింది. ఆమె హైదరాబాద్‌లోని విద్యారణ్య హైస్కూల్‌లో చదువుకుంది. స్టాన్లీ జూనియర్ కళాశాల, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఏ చేసింది. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. మిస్ ఇండియా 2000 పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. అదే ఏడాది మిస్ ఏషియా పసిఫిక్ ఇంటర్నేషనల్, ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిపిక్ టైటిల్స్ అందుకుంది. 2000లో లారాదత్తా మిస్ యూనివర్స్ కిరీటం, ప్రియాంక చొప్రా మిస్ వరల్డ్, దియా మిర్జా మిస్ ఏషియా పసిఫిక్‌తో భారత్ హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచారు.