Miss World Contestants visit KIMS Hospital : భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, వైద్య రంగంలో సేవలందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. వీరికి కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర రావు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ, కిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన మిస్ వరల్డ్-2025 ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
గొప్ప విషయం : మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈఓ మిస్ జూలియా మోర్లే గత 18 సంవత్సరాలలో ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ కిమ్స్ ఆస్పత్రుల ద్వారా చేసిన సేవలను కొనియాడారు. రోమ్ము క్యాన్సర్‌పై డాక్టర్ రఘు రామ్ చేస్తున్న సేవలను అద్భతమైనవని అభివర్ణించారు. దక్షిణ ఆసియాలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో తన సొంత ఆలోచనలతో రూపొందించిన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు.

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన : నందిని గుప్తా (మిస్ ఇండియా 2025), హన్నా జాన్స్ (మిస్ నార్తరన్ ఐర్లండ్ 2025) ఇస్సీ ప్రిన్సెస్ (మిస్ కామెరూన్- మధ్య ఆఫ్రికా), రొమ్ము క్యాన్సర ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025- ఫ్రాన్స్),డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్ఏ) తదితరులంతా డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసించారు. తమ తమ దేశాల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారు. డాక్టర్ రఘురామ్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ నుంచి తాము చాలా తెలుసుకున్నామని, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను తమ దేశాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.

ఈ సదర్భంగా కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ కేంద్రంలో నాణ్యమైన సమయం గడిపేందుకు ముందుకొచ్చిన మిస్ వరల్డ్ పోటీదారులకు కృతజ్ఞతలు తెలిపారు. రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే చాలా జీవితాలను కాపాడవచ్చని ఆయన ఈ మేరకు వెల్లడించారు. మాతృభూమిలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలను మరింత మెరుగుపచాలనే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.