Minor girl Likitha murder case Updates: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన మైనర్ బాలిక లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనిని పరువు హత్యగా పోలీసులు దీనిని నిర్ధారించారు. తమ కులం కాని యువకుడితో వెళ్లిపోతుందన్న అనుమానంతో తల్లి అత్యంత కిరాతకంగా కూతురుని హతమార్చింది. డీఎస్పీ ప్రసాద్ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో హత్య గురించి పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే? చంద్రగిరి మండలం మిట్టపాళెంకు చెందిన అజయ్, నరసింగాపురానికి చెందిన సుజాత కుమారై గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత సంవత్సరం పెద్దలకు తెలియకుండా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అజయ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అప్పటికే గర్భవతి అయిన బాలికకు తల్లి అబార్షన్ చేయించింది. ఈ క్రమంలో చిత్తూరు జైలులో ఉన్న అజయ్‌ను బాలిక తరచూ వెళ్లి పరామర్శిస్తూ వచ్చింది.
నెల రోజుల క్రితం బెయిల్‌పై అజయ్ బయటకు రావడంతో మళ్లీ బాలిక అతని వద్దకు వెళ్లిపోతుందని తల్లి అనుమానించింది. ఏప్రిల్ 4వ తేదీ అజయ్‌కు ఫోన్ చేస్తుండగా తల్లి సుజాత అడ్డుకుంది. ఇద్దరి మధ్య కాసేపు పాటు ఘర్షణ జరిగింది. కుమార్తెను బలవంతంగా ఒడిలో కూర్చోబెట్టుకుని చేతులతో నోరు, ముక్కు నొక్కి పెట్టి ఊపిరి ఆడకుండా చేసింది. కాసేపటి బాలిక మృతి చెందింది. గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని స్వర్ణముఖి నది తీరంలో దహనం చేసింది.
వీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు: ఈ ఘటనపై స్థానికుల్లో అనుమానం వచ్చింది. దీంతో స్థానిక వీఆర్వో ఫిర్యాదుతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఇంతలో తల్లి సుజాత గ్రామ పెద్దల సమక్షంలో లొంగిపోయి జరిగిన సంఘటన గురించి పూర్తి సమాచారం ఇచ్చింది. దీంతో వారు ఆమెను పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సుజాతను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుండి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.
''ఆ అబ్బాయి అంటే తల్లికి ఇష్టంలేని కారణంగా మళ్లీ తన కూతురు ఎక్కడ అతని వద్దకు వెళ్లిపోతుందనే దానిపై ఆవేశంలో ఆమె ఈ పని చేసిందని మేము భావిస్తున్నాం. అదే విధంగా భవిష్యత్తులో తన కూతురిని బాగా చూసుకుంటాడా లేదా అనే విషయం కూడా అయి ఉంటుందని భావిస్తున్నాం''-ప్రసాద్, డీఎస్పీ, చంద్రగిరి పోలీస్ స్టేషన్
అత్తింటి అరాచకం - అదనపు కట్నం కోసం వివాహిత హత్య!
ఇష్టంలేని పని చేసిన కుమార్తె - ఉరితాడు ఇచ్చి, చెట్టు చూపించిన తండ్రి