TTD Goshala Cows Death Issue : టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రులు మండిపడ్డారు. గోశాలలో వంద గోవులు చనిపోయాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మత విద్వేషాలను సృష్టించేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవతలతో సమానంగా కొలిచే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గోశాలలో ఆవుల సంరక్షణను 260 మంది ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గత వైఎస్సార్సీపీ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం అక్కడ అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. తాను నాస్తికుడని ప్రకటించుకున్న భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తిరుమలలో అనేక అవినీతి, అక్రమాలు, దోపిడీలు జరిగాయని నారాయణ ఆరోపించారు.
Tirumala Goshala Cows Issue : గోమాత, అమ్మ గురించి మాట్లాడుతున్న వారు, మాతృమూర్తికిచ్చిన విలువ ఎంటో అందరికి తెలుసని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఐదేళ్లు హైందవ ధర్మాన్ని భ్రష్టుపట్టించారని ఆక్షేపించారు. గత ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు జరగడమే కాకుండా, రథాలను దగ్ధం చేశారని చెప్పారు. భక్తులకు నాసిరకం ప్రసాదాలను పంపిణీ చేశారని విమర్శించారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారని చెప్పారు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ నేతలు లేనిపోని విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. మాజీ సీఎం జగన్ ఏనాడైనా సతీసమేతంగా ఆ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారా అని ఆనం ప్రశ్నించారు.
తప్పుడు రాతలు : కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు వైఎస్ జగన్ కుట్ర చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. హరినాథ్‌రెడ్డి కోసం టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కరుణాకర్‌రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. వంద గోవులు మరణించాయంటూ ఆయన అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్యమతం అనుసరిస్తూ నాస్తికుడని చెప్పుకునే కరుణాకర్‌రెడ్డి టీటీడీపై చేయని కుట్ర లేదని కొల్లు విమర్శించారు.
టీటీడీ గోశాలపై భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణలు అర్థరహితం, నిరాధారమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఎక్కడో చనిపోయిన ఆవుల ఫొటోతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి తప్పుడు ప్రచారం చేయడం కొత్త కాదని విమర్శించారు. ఆవులకు జియో ట్యాగింగ్ చేయలేదనేది అసత్యమని తప్పుడు ప్రచారాలతో మతవిద్వేషాలు రెచ్చగొట్టాలన్నదే వైఎస్సార్సీపీ కుట్రని ధ్వజమెత్తారు. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇకనైనా ఆ పార్టీ నేతలు వీటిని మానుకోవాలని ఆయన హితవు పలికారు.
నిరూపించగలరా? : టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయినట్లు ప్రచారం చేస్తున్న టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. వంద గోవులు మరణించాయని భూమన నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి, టీటీడీ బోర్డు మెంబర్‌గా రాజీనామా చేస్తానని చెప్పారు. అనంతపురంలోని ఆయన నివాసంలో మీడియా మాట్లాడుతూ టీటీడీని అప్రతిష్ట పాలు చేసే విధంగా కరుణాకర్‌రెడ్డి అసత్య ప్రచారం చేశారన్నారు. ఎక్కడో చనిపోయిన ఆవులను ఇక్కడ చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంఎస్ రాజు వ్యాఖ్యానించారు.
ఖండించిన టీటీడీ : మరోవైపు టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. మృతి చెందిన ఆవుల చిత్రాలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కాదని తెలిపింది. కొంతమంది దురుద్దేశంతో వాటిని ఇక్కడివిగా చూపిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని దీనిని ఖండిస్తున్నామని వివరించింది.
టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందడం అవాస్తవం - ప్రజలు నమ్మొద్దు: టీటీడీ
తిరుమల దర్శనం - ప్రజాప్రతినిధులకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక పోర్టల్