Minister Adluri Laxman Kumar : వరుస పరాజయాలు ఎదురైనా లెక్క చేయకుండా దాదాపు రెండు దశాబ్దాల పాటు పోరు సాగించారు. ఆ పోరాట ఫలితంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటిసారే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా విద్యార్థి దశ నుంచే ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ సహా జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా వివిధ పదవులు చేపట్టారు. సామాజిక సమీకరణాల కసరత్తులో భాగంగా అడ్లూరికి మంత్రి పదవికి దక్కడంతో అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాభ్యాసం నుంచే రాజకీయ ప్రస్థానం : పట్టిన పట్టు విడవకుండా అలుపెరుగని ప్రయత్నం చేస్తే విజయం దాసోహమవుతుంది అనేందుకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిదర్శనంగా నిలిచారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయాలు ఎదురైనా వెనుదిరగక, పోరాడి గెలిచిన మొదటిసారే అమాత్యయోగం వరించింది. అడ్లూరి 1968లో జన్మించారు. ఆ కాలంలోనే ఐటీఐతో పాటు ఇంటర్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం నుంచే పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్న అడ్లూరి, ఎన్‌ఎస్‌యూఐతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1982 నుంచి 1985 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పని చేశారు. 1986 నుంచి 1994 వరకు కరీంనగర్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
పరాజయాలు ఎదురైనా వెనుదిరగక : 2004లో నందిమేడారం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2006లో ధర్మారం ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా, విజయం వరించలేదు. అయితే 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. 2010లో మరోసారి ధర్మపురి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాగా, మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. 2013 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో ధర్మపురి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. 2018 నుంచి జగిత్యాల జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీకి సేవలందిస్తున్నారు.
22 వేల ఓట్ల మెజారిటీ : 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై 22 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి, తొలిసారిగా అసెంబ్లీకి వచ్చారు. 2023 డిసెంబర్ 15న అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను రాష్ట్రప్రభుత్వం విప్‌గా నియమించింది. ప్రస్తుతం సామాజిక సమీకరణాల నేపథ్యంలో మాదిగ సామాజికవర్గ కోటాలో ఆయనకు కేబినెట్ బెర్త్ ఖరారయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మూడో మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మూడో మంత్రి పదవి కోసం మాదిగ సామాజిక వర్గానికి చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ, కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ పోటీపడినా, మంత్రి శ్రీధర్ బాబు అండదండలతో అడ్లూరికి చోటు దక్కింది. కవ్వంపల్లికి మంత్రి పదవి అడ్డుకోవడంలో పొన్నం ప్రభాకర్ పావులు కదిపినట్లు తెలుస్తోంది.
అడ్లూరి ప్రస్థానం సాగిందిలా :
- 1968లో జన్మించారు.
- ఆ రోజుల్లోనే ఐటీఐ, ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఎన్‌ఎస్‌యూఐతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
- 1982-85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్ష పదవి చేపట్టారు.
- 1986-94 వరకు కరీంనగర్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
- 1996-2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
- 2004లో నందిమేడారం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడారు.
- 2006లో ధర్మారం ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి జడ్పీటీసీగా విజయం వరించింది.
- 2009లో ధర్మపురి నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
- 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జడ్పీ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు.
- 2010లో మరోసారి ధర్మపురి నియోజకవర్గానికి ఉపఎన్నికల్లో పోటీచేసి ఓడారు.
- 2013-14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు.
- 2014, 2018లో ధర్మపురి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.
- 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై 22 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
తెలంగాణ మంత్రులకు శాఖ కేటాయింపు - సోషల్ మీడియాలో అసత్య ప్రచారం
తెలంగాణ కేబినెట్ కొత్త జట్టు - రేవంత్‌తో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులు వీరే