Minister Seethakka Emotional In Her Husband Kunja Ramu Death Anniversary : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మొకాల్లాపల్లిలో మంత్రి సీతక్క భర్త కామ్రేడ్ కుంజ రాము 20వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్మన్ విమలక్క పాల్గొని కుంజ రాము చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో పలువురు వక్తలు కామ్రెడ్ రాము చేసిన పోరాటాలు ఆయన ఆశయాలను స్మరిస్తూ మాట్లాడారు.
కామ్రేడ్ రాముపై ప్రజా కళాకారులు పాడిన పాటల సీడీని సీతక్క విమలక్క చేతుల మీదుగా ఆవిష్కరించారు. విమలక్క మాట్లాడుతూ అమరవీరులను స్మరిస్తూ విమలక్క భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సీతక్క విమలక్కను ఆలింగనం చేసుకొని తన భర్త కామ్రేడ్ కుంజా రాముని గుర్తు చేసుకుని కంటతడి పెట్టడంతో సభ ప్రాంగణంలో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది.
ప్రజల కోసమే మరణిస్తాం : అనంతరం సీతక్క మాట్లాడుతూ కామ్రేడ్ కుంజ రాము చిన్నతనం నుంచి విప్లవ ఉద్యమాలకు వెళ్లి అనంతరం ఆదివాసి ఉద్యమాలకు వైపు సాగుతున్న క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్లో మృతి చెందారని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తుందని, రాముతో పని చేసిన తాను కానీ ఇతర ప్రజా సంఘాలు గాని ఉద్యమ నేతలు ఆయనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని కామ్రేడ్ రాముకు ఘనంగా నివాళులర్పించారని తెలిపారు. ఈరోజు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామని కాదు, ప్రజల కోసం ఎంత అందుబాటులో ఉన్నామనేదే ముఖ్యమని అన్నారు. ఆయన తమకు ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల కోసం పని చేస్తామని, ప్రజల కోసమే బతుకుతామని, ప్రజల కోసం చివరి వరుకు పోరాడతామని, ప్రజల కోసమే మరణిస్తామని స్పష్టం చేశారు.
"కామ్రేడ్ కుంజ రాము చిన్నతనం నుంచి విప్లవ ఉద్యమాలకు వెళ్లి అనంతరం ఆదివాసి ఉద్యమాలకు వైపు సాగుతున్న క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈరోజు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామని కాదు, ప్రజల కోసం ఎంత అందుబాటులో ఉన్నామనేదే ముఖ్యం. రాము ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల కోసం పని చేస్తాం. ప్రజల కోసమే మరణిస్తాం."- సీతక్క, మంత్రి