Minister Satya kumar Yadav Started Mother Milk Bank in Anantapur sarvajana Hospital : వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో గాడితప్పిన ప్రభుత్వ ఆసుపత్రులను చక్కదిద్దుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. అనంతపురం సర్వజనాసుపత్రిలో తల్లిపాల బ్యాంకు, శుద్ధనీటి ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఖాళీలు ఉన్నాయని ఓ పత్రిక రాస్తోందని, ఇది ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలన వైఫల్యమని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలల్లో వైద్యులు, నర్సింగ్ ఇతర సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు.
అన్ని రంగాల్లోని అవకతవకలను చక్కదిద్దే పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్య సేవలు నిలిచిపోయాయని ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏ ఆసుపత్రిలో నిలిచిపోయాయో చూపించాలని ఆయన సవాల్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్య సేవల బిల్లులు మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారని, వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని సత్యకుమార్ చెప్పారు.
'తల్లిపాల ప్రాధాన్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముర్రుపాలు బిడ్డకు రోగ నిరోధక శక్తినిచ్చి, ఆరోగ్య రక్ష కల్పించేందుకు దోహదపడతాయి. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లి ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు తల్లుల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ తల్లిపాల బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. దీంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించే సదుపాయాన్ని కూడా కల్పించాం.' -సత్యకుమార్ యాదవ్, వైద్యఆరోగ్యశాఖ మంత్రి
ఆంధ్ర హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్‌బ్యాంకును ప్రారంభించిన నమ్రతా