Minister Nimmala on Cabinet Meeting Decisions: ఏపీ షెడ్యూల్ కులాల ఆర్డినెన్సుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జనాభా దామాషా ప్రాతిపదికన మొత్తం 15 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని త్వరలోనే దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుందని వెల్లడించారు. అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వర్గీకరణ ప్రాతిపదికనే జారీ అవుతుందని స్పష్టం చేసారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్ధిక సాయం ఏప్రిల్ 26 తేదీన జమ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విశాఖలో ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు 21.66 ఎకరాల భూ కేటాయింపునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
మరికొన్ని ఐటీ సంస్థలకు కూడా భూ కేటాయింపులు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని పరిధిలో రహదారులు నిర్మాణం, ఇతర భవనాలు నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపిందని అలానే గుంటూరులో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయింపు, విజయనగరం జిల్లా కొత్త వలస వద్ద గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌కు భూ కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఉద్యోగాల ఆధారంగా పరిశ్రమలకు భూ కేటాయింపుల చేసేలా కేబినెట్లో తీర్మానం చేసారని ఇంక గనుల తవ్వకాల వ్యవహారంలో నిబంధనల ప్రకారం వేలం వేసేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు.
కుల, మత ప్రాంతాలను జగన్ రెచ్చగొడుతున్నారు - సీఎం చంద్రబాబు ఆగ్రహం
రెచ్చగొట్టేలా జగన్ అండ్ కో ప్రయత్నం: వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తోందని మంత్రి నిమ్మల విమర్శించారు. పాస్టర్ ప్రవీణ్ పేరు చెప్పి క్రైస్తవులను, గోశాల పేరు చెప్పి హిందువులను, వక్ఫ్ చట్టం పేరుతో ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం లో మృతి చెందితే వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా జగన్ అండ్ కో ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. డిక్లరేషన్‌పై సంతకం పెట్టమంటే జగన్ తిరుమల దర్శనానికే వెళ్లలేదని అన్నారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం సతీమణి అన్య మతస్తురాలు అయినా ఆమె డిక్లరేషన్‌పై సంతకం పెట్టారని చెప్పారు. తలనీలాలు ఇచ్చి, 17 లక్షల అన్నదానం కోసం విరాళం ఇచ్చారని మంత్రి తెలిపారు.
నాస్తికుడు అయిన కరుణాకర్ రెడ్డి తన సంతానం పెళ్లిళ్లు ఏ సంప్రదాయం ప్రకారం చేశారో అంతా చూసారని విమర్శించారు. రాజధాని పనులు ప్రారంభించడానికి మే 2వ తేదీన ప్రధాని మోదీ హాజరు అవుతారని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. పీ4 విధానం పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా 2047 ప్రణాళిక తో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.
అన్ని జిల్లాలో ఈ ఆర్డినెన్సు అమల్లోకి: షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. 200పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. విద్యా ఉద్యోగాల్లో ఉప వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా త్వరలోనే గెజిట్ విడుదల చేస్తామని అన్నారు. గ్రూప్ 1లో 12 ఉప కులాలకు 1 శాతం, గ్రూప్ 2లో 18 ఉప కులాలకు 6.5 శాతం రిజర్వేషన్, గ్రూప్ 3లో 29 ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. 26 జిల్లాలో ఈ ఆర్డినెన్సు అమల్లోకి వస్తుందని మంత్రి డోలా స్పష్టం చేశారు.
అమరావతి పునర్నిర్మాణ పనులు - మే 2న రాష్ట్రానికి మోదీ
తిరుమలపై వైఎస్సార్సీపీ నేత భూమన అసత్య ప్రచారం - చర్యలకు సిద్ధమైన టీటీడీ