ENTREPRENEUSHIP ACTION PLAN WORKSHOP: నిజమైన లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి ఏ పథకం అందాలన్నా సంబంధిత డేటా సక్రమంగా ఉండాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో 80 వేల డ్వాక్రా సంఘాలకు 8 వేల కోట్ల రూపాయల రుణాలు అందించేందుకు ఆలోచన చేస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ప్రస్తుతం మెప్మా పీడీలు రాష్ట్రంలో 13 జిల్లాలకే ఉన్నారని, 26 జిల్లాలకూ పీడీలను నియమిస్తామని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న వారికి పదోన్నతి లభిస్తుందని స్పష్టం చేశారు. మెప్మా విభాగంలో పని చేస్తున్న ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామన్నారు.
మెప్మా వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి నారాయణ: విజయవాడలోని అమరావతి కన్వెన్షన్‌లో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి మహిళా వ్యాపారాభివృద్ధి కార్యాచరణ, ప్రణాళిక వర్క్‌షాప్‌కి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏడాది కాలంలో లక్షమంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. మెప్మా వెబ్‌సైట్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారు.
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త: ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడినారు. తాను మంత్రిగా అయినప్పటి నుంచి డేటా సరిగ్గా ఉందా, లేదా అని అధికారులను అడిగినుట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఎందుకంటే డేటా కరెక్టుగా ఉంటేనే ప్రజలకు ఏమైనా చేయగలమని పేర్కొన్నారు. ఎవరెవరు ఎంత మంది ఉన్నారో తెలిస్తేనే వారికోసం ప్రభుత్వం నూతన పాలసీలు చేయగలదని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని సీఎం చంద్రబాబు తెలిపారని మంత్రి నారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా తామంతా పనిచేస్తున్నామని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంతా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఒక సంవత్సరంలో లక్ష మంత్రి మహిళా పారిశ్రామిక వేత్తలను తయారుచేస్తామని స్పష్టం చేశారు.