Minister Narayana Clarity on Capital Amaravati Lands : రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటి ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు.
స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, జనాభా పెరుగుతుందని వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు.