Minister Lokesh About New House: ప్రజారాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు శంకుస్థాపన చేసారు. వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. జి ప్లస్ 1 మోడల్లో చేపట్టిన ఈ ఇంటినిర్మాణం ఏడాదిలోపే పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు రచించారు. తమ ప్రాంతంలో చంద్రబాబు కుటుంబం సొంతిల్లు నిర్మించుకోవడం పట్ల రాజధాని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం చేపట్టిన సొంత ఇంటి నిర్మాణ శంకుస్థాపన నిడారంబరంగా సాగింది. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ మాత్రమే కార్యక్రమంలో పాల్గొని శాస్త్రోతంగా పూజలు నిర్వహించారు. ప్రైవేటు కార్యక్రమం కావటంతో ఇతరులెవ్వరినీ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. శంకుస్థాపన కార్యక్రమం అనంతం కుటుంబసభ్యులు ప్రాంగణమంతా కలియ తిరిగారు. నారా లోకేశ్ కుటుంబ సభ్యులకు ఎక్కడ ఏం వస్తుందనే ఇంటి నిర్మాణ ప్లాన్‌ను స్వయంగా వివరించారు. వెలగపూడి గ్రామస్థుల తరఫున చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆ ఊరి పెద్దలు పట్టు వస్త్రాలు సమర్పించారు.
రైతుల సంతోషం: వేడుక తిలకించేందుకు పెద్దఎత్తున అక్కడికి వచ్చిన రాజధాని రైతులు కార్యక్రమం ముగిసిన వెంటనే జై చంద్రబాబు, జై అమరావతి అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. చంద్రబాబు, లోకేశ్‌లు కాన్వాయ్ ఆపి రైతులందరినీ ఆప్యాయంగా పలకరించారు. రైతులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్‌ను అదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది.
స్థలంలో నైరుతి మూలన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎక్కువ భాగం పచ్చదనం, మొక్కల కోసం ఉద్దేశించారు. నిర్మాణ బాధ్యతను ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. తాత్కాలిక హైకోర్టు, సచివాలయం మధ్యన ఉన్న ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్లు ఉండడం విశేషం. తూర్పున ఎన్10 రోడ్డు, ఉత్తరం వైపు ఈ6 రహదారులు ఉన్నాయి. పశ్చిమం, దక్షిణాన లేఅవుట్‌లోని అంతర్గత రోడ్లు వెళ్తాయి. ఈ ప్లాట్‌కు అనుకుని రోడ్డు ఉంది. దీని పక్కనే ఉన్న వెయ్యి చ.గజాల ప్లాట్‌ను మల్కాపురం గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇది ఈశాన్యంలో ఉండడంతో వాస్తు కోసం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో సెక్యూరిటీ పోస్టు, సందర్శకులు వాహనాలు నిలిపేందుకు వినియోగించనున్నారు.
అమరావతి అజరామరం: ప్రజా రాజధాని అమరావతి లో సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన ఘట్టంతో తమ కుటుంబo ఆనందంతో భావోద్వేగానికి గురైందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి తెలిపారు. లక్షలాది మంది హృదయాల్లో ఉన్న రాజధాని అమరావతిలో తన తండ్రి చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ జరగటం ఎంతో గర్వకారణమని లోకేశ్ వెల్లడించారు. కలల్ని పునరుద్ధరించే ఈ క్షణాలు ఎంతో విలువైనవని చెప్పారు. తన తండ్రి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఊహించిన ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి ఓ కలగా అభివర్ణించారు.
Today is a deeply emotional day for me and our entire family. With immense pride and gratitude, I witnessed my father, @ncbn garu, perform the Bhumi Puja for our home in Amaravati — the capital that lives in the hearts of millions. This moment is far more than just the beginning… pic.twitter.com/qPPMo5pA1b
— Lokesh Nara (@naralokesh) April 9, 2025
తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ అంతా కలిసి ఈ పవిత్ర అడుగులో భాగం కావడం ఒక ఆశీర్వాదమని తెలిపారు. ఇది తమ ఇల్లు మాత్రమే కాదని తమ నిబద్ధతకు చిహ్నమని వివరించారు. అమరావతి అజరామరమని లోకేశ్ స్పష్టం చేశారు. అమరావతి పునర్నిర్మాణం బలంగా, మరింత దృఢంగా ఎప్పుడూ లేనంత అందంగా సాగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తికి తగ్గట్టే రాజధాని అమరావతి మళ్లీ ప్రకాశిస్తోందన్నారు. ఆంధ్రుల పవిత్ర నేలలో తమ కుటుంబానికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని బ్రాహ్మణి చెప్పారు. చంద్రబాబు ఎంతో ప్రేమతో నిర్మించిన ప్రజల రాజధాని అమరావతిలో మా ఇంటికి భూమి పూజ చేస్తున్న సమయం తమకు భావోద్వేగ క్షణమని వెల్లడించారు.
A day etched in our hearts forever!
— Brahmani Nara (@brahmaninara) April 9, 2025
We stood beside our beloved @ncbn garu with immense gratitude and hope as he performed Bhumi Puja for our home in Amaravati — the People’s Capital he envisioned and built with unwavering love.
It was a deeply emotional moment to be there as… pic.twitter.com/yeSNyrN1EP
విభజన తరువాత అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు ఇదే ప్రాంతంలో నివాసం ఉండి పాలన సాగించారు. రాజధాని నిర్మాణం ప్రథమ ప్రాధాన్యంగా భావించిన ఆయన, 2019 వరకు భూసేకరణ, డిజైన్లు, నిర్మాణాలపైనే దృష్టిపెట్టారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి రోజు నుంచే అమరావతిపై దృష్టి సారించారు. నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలు ఎక్కించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించారు. దేశ, విదేశీ సంస్థలను అమరావతికి రప్పించి ఆంధ్రులు గర్వపడేలా రాజధానిని తీర్చిదిద్దుతున్నారు. అమరావతి పనులు గాడిన పడడం, మళ్లీ బ్రాండ్ పునరుద్ధరణతో చంద్రబాబు తన సొంతి ఇంటి వ్యవహారంపైనా దృష్టిపెట్టారు. స్వయంగా సీఎం కూడా ఇదే ప్రాంతంలో సొంతి ఇంటి నిర్మాణం చేపడడంతో ఈ ప్రాంతం ప్రజలతో పాటు అందరిలో ఒక నమ్మకం, భవిష్యత్‌పై భరోసా కలగించినట్లైంది.
‘సారీ గాయ్స్ - హెల్ప్ చేయలేకపోతున్నా’ - మంత్రి నారా లోకేశ్ పోస్ట్
ఎవరికీ ఏ కష్టం వచ్చినా నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: మంత్రి లోకేశ్