Minister Nara Lokesh on Thalliki Vandanam: తల్లికి వందనం అర్హులు ఎంతమంది ఉంటే అంత మందికీ లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చిందని కాని కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు ఇచ్చామని తెలిపారు. అర్హులు ఇంకా ఉన్నా ఇస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం కంటే రూ.3405 కోట్లు అదనంగా తల్లికి వందనం నిధులు చెల్లిస్తున్నట్లు వివరించారు.
ఇప్పటి వరకూ 18.55 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని తెలిపారు. అలానే 9600 పాఠశాలల్లో ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానం పెట్టామని గత ప్రభుత్వంలో కేవలం 1200 పాఠశాలల్లో మాత్రమే ఈ విధానం అమలైందని తెలిపారు. సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే వాట్సాప్ కంప్లెయింట్ ద్వారా వాటిని పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. 2 శాతం మంది తల్లుల అకౌంట్ ఇనాక్టివ్గా ఉన్నాయని, వారిని మెసేజ్ ద్వారా అప్రమత్తం చేశామని తెలిపారు.
వైఎస్సార్సీపీకి పరిణామాలు తప్పవు: తల్లికి వందనంలో రూ.13,000 ఇచ్చి రూ.2000 నా ఖాతాలో పడ్డాయన్న వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. రూ.2,000 తన ఖాతాలో పడినట్లు రుజువు చేయాలని, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే వారిపై చట్టప్రకారం ముందుకెళ్తానని తేల్చిచెప్పారు. అసత్య ఆరోపణలని గతంలో మాదిరే ఇప్పుడూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉపాధ్యాయుల బదిలీలు సోమవారం కల్లా పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రజలందరూ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
ఇంటర్మీడియట్లో సంస్కరణలు: ఇంటర్మీడియట్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వాటిని సక్రమంగా అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో ఇంకా చాలా సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని వాటిపై దృష్టి సారించామన్నారు. ఫీజు రీ ఎంబర్స్మెంట్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఒకరిని చదివించి మిగిలిన వారిని పనులకు పంపించే పరిస్థితి ఉండేదని ఇప్పుడు అలా లేదని తెలిపారు.
ఉదయం నుంచి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ వీడియోలు, స్క్రీన్ షాట్ మేసేజ్లు పెడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రుల ఫీడ్ బ్యాక్ చాలా ఆనందం కలిగిస్తోందని అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ తమ విధానమని స్పష్టం చేశారు.
67 లక్షల మంది-రూ.10,091 కోట్లు - ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం': చంద్రబాబు
'చంద్రబాబు తాతకు థాంక్స్' - ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం