Mana Illu Mana Lokesh program in Mangalagiri: ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. దేశంలో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్నాకే ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళగిరిలో 3వ రోజు మన ఇల్లు - మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేశ్ స్వయంగా పంపిణీ చేశారు.
తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231 మందికి, పద్మశాలి బజార్‌కి చెందిన 127 మంది పేదలకు పట్టాలను అందజేశారు. మధ్యాహ్నం నుంచి పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. ఇవాళ మొత్తం 624 మంది లబ్దిదారులకు శాశ్వత ఇంటి పట్టాలతో పాటు లోకేశ్ సొంత ఖర్చులతో బట్టలు, పసుపు కుంకుమ పెట్టి అందచేశారు.
ఒక్క రూపాయి అవినీతి లేకుండా వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిని మంగళగిరి ప్రజలకు అందచేస్తున్నామని లోకేశ్ తెలిపారు. మంగళగిరి ప్రజల కోసం తెచ్చిన శాశ్వత ఇళ్ల పట్టాల జీవో రాష్ట్రమంతటా అమలయ్యేందుకు ఉపయోగపడిందన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసే జెమ్స్ జ్యువెలరీ పార్క్ స్వర్ణకారుల దశ మారుస్తుందని వివరించారు.
‘సారీ గాయ్స్ - హెల్ప్ చేయలేకపోతున్నా’ - మంత్రి నారా లోకేశ్ పోస్ట్
2 ఏళ్లలో ఇళ్ల పట్టాలు: రైల్వే, దేవాదాయ భూముల్లో ఇళ్ల పట్టాలు 2 ఏళ్లలో ఇస్తామని నారా లోకేశ్ తెలిపారు. అటవీ, ఇరిగేషన్ పరిధిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా కష్టమని, అయినా 3 ఏళ్లలో ఇస్తామన్నారు. మొత్తం 7 వేల మంది ఇళ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకుంటే 4 వేల మంది ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే ఉన్నారన్నారు. ఇచ్చిన పట్టా రెండు సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. తన మీద ఉంచిన బాధ్యతను కచ్చితంగా నెరవేరుస్తానన్నారు.
ఇచ్చిన హామీలు పద్ధతి ప్రకారం అమలు చేయాలనే ఉద్దేశంతో ఆచితూచి అడుగులు వేస్తున్నామని లోకేశ్ అన్నారు. స్వచ్చ మంగళగిరి పేరుతో కార్యక్రమం చేపట్టామని ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు గడపగడపకు వచ్చి చెత్తను తొలగిస్తున్నారన్నారు. అన్నిరంగాల్లో మంగళగిరిని నెం.1గా మార్చేందుకు ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానని లోకేశ్ స్పష్టం చేశారు.
లబ్ధిదారులు హర్షం: తోబుట్టువు పుట్టింటికి వస్తే బట్టలు పసుపు కుంకుమ పెట్టి ఆదరించిన అన్న తరహాలో మంత్రి నారా లోకేశ్ ఇళ్ల పట్టాలు పంపిణి చేస్తున్నారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేసారు. 'ఇది మంచి ప్రభుత్వం' అని చెప్పేందుకు ఇంతకంటే ఏం నిదర్శనం ఉంటుందన్నారు. దశాబ్దాల నాటి కల కేవలం పది నిముషాల్లో పరిష్కారం అవ్వటం ఆనందంగా ఉందన్నారు. మంగళగిరి లో ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు - లోకేశ్‌ని చూసి వృద్ధురాలు భావోద్వేగం
మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పని చేస్తా: మంత్రి లోకేశ్