Minister Lokesh Present Shining Star Awards on 9th June in Parvathipuram : పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్స్ అవార్డులతో ఈ నెల 9న సత్కరించేందుకు విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. పార్వతీపురం మన్యంలో జరిగే కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు
ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో అర్హత గల విద్యార్థులకు మంత్రి లోకేశ్ అవార్డులు అందజేయనున్నారు. ఈ క్రమంలో లోకేశ్ జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు లోకేశ్ షైనింగ్ స్టార్ అవార్డులు అందజేస్తారని చెప్పారు.
'రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతికి సంబంధించి 4,169, ఇంటర్మీడియట్ నుంచి 919మందికి అవార్డులు ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో విద్యార్థులతో మంత్రి ముఖాముఖిలో పాల్గొననున్నారు. లోకేశ్ పర్యటన సందర్భంగా రాయల్ కన్వెన్షన్ హాలులో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించాం. అనంతరం చిన్న బొండపల్లి సమీపంలో జరిగే పార్టీ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొంటారు.' -మంత్రి సంధ్యారాణి
ఎంపికైన విద్యార్థులకు నగదు: పదో తరగతిలో మండలాల వారీగా, ఇంటర్మీడియట్‌కు జిల్లాలవారీగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో నిర్వహిస్తారు. అవార్డుకు ఎంపికైన విద్యార్థులకు రూ.20వేల నగదు, పతకం, సర్టిఫికెట్ అందిస్తారు. పదో తరగతిలో 500 (83.33%) మార్కులకుపైగా సాధించినవారిని ఈ అవార్డులకు ఎంపికచేస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు 70% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌కు సంబంధించి జిల్లా స్థాయిలో 830 మార్కులకుపైన సాధించిన వారిని ఎంపికచేస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు 700 మార్కులు కటాఫ్‌గా పెట్టారు.
గుడ్‌న్యూస్ - వారికి 'షైనింగ్ స్టార్' అవార్డులు
ప్రతి జిల్లాకు 36 మంది: ప్రతి మండలంలో అత్యధిక మార్కులు సాధించిన మొత్తం ఆరుగురు పదో తరగతి విద్యార్థులకు అవార్డులు ఇస్తారు. ప్రతి మండలంలో ఇద్దరు ఓసీ , ఇద్దరు బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్లో 830 మార్కుల పైన అధిక మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు జిల్లాల వారీగా ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు.