Minister Lokesh Distributed Permanent House Pattas On Fourth Day : లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తామన్నారు. 50 రోజుల్లో పాఠశాల రూపురేఖలు మారిపోవాలని పట్టుదలతో పని చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మించినట్లే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కృష్ణానది వెంబడి 300 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నట్లు లోకేశ్ ప్రకటించారు.
మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేక హామీలను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తామని నారా లోకేశ్ వెల్లడించారు. మంగళగిరిలో 4వ రోజు 'మన ఇల్లు-మన లోకేశ్' కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. పేదలకు మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. రత్నాలచెరువుకు చెందిన 600 మందికి, తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు.
ఎవరికీ ఏ కష్టం వచ్చినా నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: మంత్రి లోకేశ్
మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకుంటూ మీ లోకేశ్ మీ ముందు నిలబడుతున్నాడని తెలిపారు. మంగళగిరికి మంజూరైన ఆంధ్రప్రదేశ్‌లో తొలి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి 13వ తేదీన శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉండగానే మంగళగిరి కోసం సొంత ఖర్చులతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే, అధికారంలో ఉండగా ఇంకెంత చేయగలనో ఆలోచించాలని కోరారు. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేసిందని వెల్లడించారు.
బాధ, ఆవేదనతో పెరిగిన కసి నుంచే మంగళగిరి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు లోకేశ్ వెల్లడించారు. మంగళగిరిలో గెలవలేనివాడివి ఇంకేం మాట్లాడతావ్ అని కొందరు ఎగతాళి చేస్తే, కొడుకుని కూడా గెలిపించుకోలేకపోయాడని చంద్రబాబుని కూడా అవమానించిన వారున్నారని గుర్తు చేశారు. ఓడిన చోట నుంచే అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడతానన్నారు. 91 వేల మెజారిటీతో గెలిపించిన ప్రజలు తనపై ఇంకా బాధ్యత పెంచారన్నారు. తన గౌరవం, పరువు కాపాడిన మంగళగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని ఏ లోటులేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. స్వచ్ఛతతో సహా అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కలసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు - లోకేశ్‌ని చూసి వృద్ధురాలు భావోద్వేగం
మంగళగిరిలో దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేయడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన వస్త్రాలు, మహిళలకు పసుపు-కుంకుమ పెట్టి స్వయంగా మంత్రి లోకేశ్ ఇంటి పట్టాలు అందిస్తున్నారు. తొలి విడతలో మంగళగిరి నియోజకవర్గంలో 3వేల మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణి చేయనున్నారు. లోకేశ్ చేసిన సాయం మర్చిపోలేనిదంటూ లబ్ధిదారుల హర్షం చేశారు.
ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని ఓ క్రమపద్ధతిలో నెరవేరుస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలనను చిత్తశుద్ధితో అందించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. సూపర్ సిక్స్‌లో కొన్ని హామీలు మే నెలలో నిలబెట్టుకోబోతున్నామని వెల్లడించారు. త్వరలో మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, కరెంట్ ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్లు తెలిపారు.
'దశాబ్ధాల సమస్యకు 10 నెలల్లోనే పరిష్కారం' - ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేశ్