Minister Konda Surekha Comments on Fine Rice: ప్రతి రేషన్ డీలరు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరగా పాటించి లబ్ధిదారుడికి సన్నబియ్యం ఇవ్వాలని, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సంబంధిత రేషన్ డీలరుపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపిస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. శనివారం దేశాయిపేటలోని రేషన్‌కార్డు లబ్ధిదారు సోల రేణుక ఇంట్లో జిల్లా కలెక్టర్ డా.సత్యశారద, మున్సిపల్ కమిషనర్ డా.అశ్విని తానాజీతో కలిసి కొండా సురేఖ భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అర్హులైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన తమ పార్టీ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
కల్తీ బియ్యాన్ని ప్రజలకు అందిస్తే కఠిన చర్యలు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. గతంలో మిల్లర్లతో కలిసి దొడ్డు బియ్యాన్ని ప్రాసెస్ చేసి సన్నబియ్యం పేరుతో వసతి గృహాలకు(హాస్టళ్లకు) ఇచ్చి మోసం చేశారన్నారు. రేషన్ డీలర్లు కల్తీ చేసిన బియ్యాన్ని ప్రజలకు అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లు అక్రమాలకు పాల్పడితే లబ్ధిదారులు కంప్లైంట్ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.సత్యశారదను మంత్రి ఆదేశించారు.
అనంతరం రేషన్‌కార్డు లబ్ధిదారు సోల రేణుక, ఆమె కుటుంబ సభ్యులకు మంత్రి, కలెక్టర్ నూతన వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సంధ్యారాణి, సత్యపాల్‌రెడ్డి, ఇక్బాల్, కార్పొరేటర్లు బస్వరాజు కుమార్, కవిత, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, నవీన్‌రాజ్, ఇనుముల నాగరాజు, పూర్ణ, విజయ్, తేజు పాల్గొన్నారు.
సన్నబియ్యం కోసం రేషన్ షాపుల ముందు జనాలు - అచ్చం జాతర మాదిరే!
సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం - పథకాలు వస్తున్నాయా అంటూ ఆరా