Minister Durgesh Visit Railway Over Bridge Works Nidadavolu : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఆలస్యం వల్లే రెండేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఆర్వోబీ అప్రోచ్ రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరగా రోడ్డు నిర్మించాలని ఆర్అండ్బీ అధికారులను సూచించారు. మురుగు కాలువల్లో సిల్ట్ ఎప్పటికప్పుడు తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఆర్వోబీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
మంత్రి పరిశీలన సమయంలో స్థానికులు రహదారులు సరిగ్గా లేకపోవడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాలు బయటపెట్టే అవకాశం లేకుండా రహదారుల పరిస్థితి ఉందని, ములుగు కాలువలలో సిల్ట్‌ను పురపాలక సంఘ సిబ్బంది తీయకపోవటం వల్ల మురుగునీరు ఇళ్లలోకి వస్తుందని తెలిపారు. మంత్రి కొంత దూరం కాలినడకన బురదలో నడిచి, మరి కొంత దూరం జేసీబీపై ప్రయాణించి పనులను పరిశీలించారు.
'ఆర్వోబీ పనులు సరిగ్గా జరగకపోవడం వల్ల రెండు సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమాదాలకు గురైన పరిస్థితులు ఉన్నాయి. వర్షాలు మే నెల చివర్లోనే ప్రారంభం కావడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తాత్కాలిక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేసి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేయాలని ఇప్పటికే అధికారులకు, గుత్తేదారులకు సూచించాం.' -కందుల దుర్గేశ్, మంత్రి
పోర్టుల అనుసంధాన రోడ్లకు మహర్ధశ - వెయ్యి కోట్లతో పనులకు ప్రణాళిక
దారి తప్పిన కర్నూలు-గుంటూరు రహదారి పనులు - వర్షాలకు కొట్టుకుపోయిన మట్టి