Minister Damodara on Medical Seats Counselling : నీట్‌లో ఉత్తీర్ణులై, ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఇచ్చిన గడువులోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ తప్పకుండా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులను, అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు.
తెలంగాణ ప్రాంత విద్యార్థులకే సీట్లు దక్కాలన్నది తమ ఆలోచనని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మరో వారం రోజుల లోపలే కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని, ఈలోగా వెబ్ ఆప్షన్ల నమోదు కోసం విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వివరాలు, సీట్ల వివరాలు శనివారం ఉదయం 11 గంటల నుంచి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో https://www.knruhs.telangana.gov.in అందుబాటులో ఉంటాయని తెలిపారు. గతేడాది ఏయే ర్యాంకు విద్యార్థులకు ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయన్న వివరాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వాటిని పరిశీలించి, మీ ర్యాంకుకు అనుగుణంగా వెబ్ ఆప్షన్ల కోసం జాబితాను సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఉపయోగపడేలా హెల్త్ కార్డులు : మరోవైపు హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు బేసిక్ సమాచారంతోనే కార్డులు తయారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారీపై అధికారులు, ప్రైవేటు హాస్పిటళ్ల ప్రతినిధులతో మంత్రి దామోదర సచివాలయంలో సమీక్షించారు.
ప్రజలను భయపెట్టేలా, వారికి ఇబ్బంది కలిగేలా సమాచార సేకరణ ఉండకూడదన్న మంత్రి, హెల్త్ ప్రొఫైల్ అవసరాన్ని వివరించి, వారి సమ్మతితోనే సమాచార సేకరణ జరిగేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో అవలంభిస్తున్న విధానాలను అధికారులు మంత్రికి వివరించారు. హెల్త్ ప్రొఫైల్‌లో ప్రాథమిక సమాచారం మాత్రమే సేకరించాలని, ఒకేసారి ప్రజలందరికీ రక్త పరీక్షలు చేయడం సాధ్యం కాదని తెలిపారు. గతంలో ములుగు, సిరిసిల్లలో చేసిన పైలట్ ప్రాజెక్ట్ విఫలమడానికి ఇదే కారణమని మంత్రికి వివరించారు.
ప్రాథమిక వివరాలతో హెల్త్ కార్డు : ఈ క్రమంలో గత అనుభవాలను దృష్ట్యా ఈసారి ప్రతిపాదనలను తయారు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. తొలుత ప్రజల వద్ద పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఏదైనా ఐడీ కార్డు నంబర్, ఫోన్ నంబర్, వృత్తి వంటి సాధారణ వివరాలను సేకరించి వాటితో హెల్త్ కార్డులు తయారు చేయాలన్నారు. యూనిక్ నంబర్, ఫొటో, బార్ కోడ్‌తో ఈ కార్డులు ఉండాలని సూచించారు. ఆ తర్వాత వ్యక్తి హెల్త్ హిస్టరీ, గతం తాలూకా అనారోగ్య సమస్యలు, అనారోగ్య కారక అలవాట్ల సమాచారాన్ని సేకరించి, ఆ వివరాలను హెల్త్ కార్డుల్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కమిషనర్ కర్ణన్‌కు సూచించారు.