Minister Anagani Satya Prasad Comments on Jagan : వెన్నుపోటు దినమంటూ జగన్ కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఐదేళ్లు ప్రజలకు చేసిన మోసానికి జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో రాక్షసపాలనకు ఎండ్ కార్డ్ పడిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. ప్రజలను వేధించి, వేయించుకు తిన్న నేతలకు ఓటర్లు బుద్ది చెప్పారని అన్నారు.
వెన్నుపోటు దినం అంటూ రాజకీయాలు చేయటం సరికాదన్నారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన జూన్ 4 తేదీని వైఎస్సార్సీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని తేల్చి చెప్పారు. దళితులను జగన్ దగా చేసిన చరిత్రను ప్రజలు ఎవరూ మర్చిపోలేరని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. కుట్ర పూరిత రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. అల్లరి మూకలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
'జూన్ 4న వైఎస్సార్సీపీ నేతలు పశ్చాత్తాప దినంగా నిర్వహించుకోవాలి. కూటమి ప్రభుత్వ పాలన చూసి ఆ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారు. అలవాటు ప్రకారం అసత్యాల ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. తల్లి, చెల్లిని వెన్నుపోటు పొడిచిన జగన్‌ను ప్రజలు నమ్మట్లేదు. ఇదే వైఖరి కొనసాగితే వైఎస్సార్సీపీ పరిస్థితి గుండుసున్నానే.' - మంత్రి అనగాని సత్యప్రసాద్
'మాజీ ముఖ్యమంత్రి జగన్ తెనాలిలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయని మొసలి కన్నీరు కారుస్తున్నారు. పోలీసుల మీద దాడుల చేసిన, గంజాయి గ్యాంగ్‌ను అదుపు చేస్తున్న పోలీసులకు సహకరించకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా దళితులు మోసపోయింది, ఎస్సీ విద్యార్థులకు ఎంతో అన్యాయం జరిగింది వైస్సార్సీపీ హయాంలోనే. ఏనాడైనా విద్యార్థులకు 50 శాతం స్కాలర్షిప్ ఇచ్చారా? దళితులంటే ప్రేమ అన్నావు, మేనమామ అన్నావు వారిని దగా చేసి కూర్చున్నావు.ఇదంతా చరిత్ర మరిచిపోలేదు. తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ రాద్దాంతం చేసి కుట్రపూరితంగా వ్యవహరించొద్దు. ప్రజా ప్రతినిధిగా లా అండ్ ఆర్డర్‌కు సహకరించాల్సింది పోయి ఇలా వ్యవహరించడం సరి కాదు.' -మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి