Minimum Flow Reduced In Godavari River : గోదావరి నదిలో కనీస ప్రవాహము కరవైంది. ఎగువనుంచి 500 క్యూసెక్కులు కూడా రాని పరిస్థితి ఏర్పడటంతో ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ వెలవెలబోతోంది. ఇదిలా ఉండగా మరోవైపు దిగువన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటిమట్టం తగ్గింది. దీంతో రానున్న రోజుల్లో పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేయలేని ప్రమాదముంది. మార్చి 2వ వారం నుంచే గోదావరిలో ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. ఇంద్రావతి, ప్రాణహిత ఇలా అన్ని ఉపనదుల్లో కలిపి ప్రవాహం 500 క్యూసెక్కులు దాటకపోవడంతో దేవాదుల మోటార్లు నీటిని ఎత్తిపోయడానికి వీలుగా సమ్మక్క సాగర్ బ్యారేజీ గేట్లు మూసి వేశారు.
చత్తీస్‌గఢ్ వ్యతిరేకించడంతో : దీంతో దిగువకు చుక్కనీరు కూడా విడుదల కావడంలేదు. సమ్మక్క సాగర్‌లోనూ 0.9 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో డెడ్‌స్టోరేజీ 0.6 టీఎంసీలు కాగా ఇక 0.3 టీఎంసీలే వినియోగానికి ఉన్నాయి. పోయిన ఏడాది ఇదే సమయానికి సమ్మక్క సాగర్‌లో 2 టీఎంసీల నీరు ఉంది. ఈ ఏడాది దేవాదుల మూడో దశ మోటర్లు నడపటం, గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహం లేకపోవడంతో సమస్య ఎక్కువైంది. వాస్తవానికి తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజీని మొదట 20 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. తర్వాత ముంపు కారణంగా ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకించడంతో నిల్వ సామర్థ్యం తగ్గించి 6.9 టీఎంసీలు చేపట్టారు. అయినప్పటికీ కొంత ముంపు ఉందని ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పూర్తిస్థాయి నీటిమట్టం 83 మీటర్లు అయినా 80 మీటర్లకే నిల్వ చేసే పరిస్థితి వచ్చింది. దీనివల్ల 4 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం ఉండడంతో ప్రస్తుతం గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉంది.
రూర్కీ ఐఐటీతో అధ్యయనం : సమ్మక్కసాగర్‌లో 6.9 టీఎంసీల నిల్వకు వీలుగా పోయిన సంవత్సరం రెండు రాష్ట్రాల అధికారులు కలిసి సర్వే చేసినా ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వలేదు. అంతవరకు నిల్వ చేస్తే సుమారు 30 ఇళ్లు ముంపునకు గురవుతాయని తేలింది. మిగిలినవి వాగులు, వంకలు అందుకు వాటికి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలంగాణ ఇంజినీర్లు వాదిస్తున్నారు. అయితే వరద వచ్చినప్పుడు ముంపు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ నష్టం ఎంతనేది తేల్చడానికి రూర్కీ ఐఐటీతో అధ్యయనం చేయిస్తున్నామని, ఇది పూర్తయ్యాకే ముంపు ప్రమాదం ఎంతనేది తేలుతుందని తాజాగా ఛత్తీస్‌గఢ్ ఇంజినీర్లు పేర్కొన్నట్లు సమాచారం. మొత్తమ్మీద సమ్మక్కసాగర్ పూర్తయినా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దేవాదుల ఎత్తిపోతలలో భాగంగా ఉన్న ధర్మసాగర్‌లో గతేడాది ఒక టీఎంసీ ఉండగా, ప్రస్తుతం 0.6 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. ఇక్కడ మరికొంత నీటిని నింపాల్సిన అవసరం ఉందని ఇంజినీర్లు తెలిపారు.
లేఖలో వివరణ : సమ్మక్క సాగర్ నుంచి నీటిని విడుదల చేయకుంటే ఈ నెలాఖరు నుంచి పరిశ్రమలకు, మిషన్ భగీరథ అవసరాలకు నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతుందని కొత్తగూడెం ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ ములుగు చీఫ్ ఇంజినీర్‌కు ఈ నెల 4న లేఖ రాశారు. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద 0.8 టీఎంసీ నిల్వ ఉందని, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఈ నెలాఖరు వరకు సరిపోతాయని పేర్కొన్న ఆయన ఇక్కడి నుంచే మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి కాలరీస్, ఐటీసీ తదితర భారీ పరిశ్రమలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని లేఖలో వివరించారు. జూన్ ఆఖరు వరకు రోజుకు 600 క్యూసెక్కులు విడుదల చేయాలని లేఖలో కోరారు. అయితే సమ్మక్క సాగర్‌కు వచ్చే ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేసే అవకాశాలు చాలా తక్కువ.
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్ - 20 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు - రానున్న రోజుల్లో కష్టమే!