Minimal Patrolling on Trains Due To Staff Shortage : ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారింది. పోలీసు సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ రక్షణ చర్యలు పూర్తిగా గాలికి వదిలేశారు. నామమాత్రపు గస్తీతో మమ అనిపిస్తున్నారు. ఇదే అదనుగా దొంగలు, ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. తాజాగా ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న యువతిపై ఆగంతకుడు అత్యాచారయత్నం చేయబోగా, బాధితురాలు కదిలే రైలు నుంచి కిందకు దూకి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనతో జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ పోలీసులు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు.
పలు విధాలుగా పోలీసులకు ఫిర్యాదులు : ప్రయాణికుల మధ్య చేరుతున్న స్నాచర్లు సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు కొట్టేసి క్షణాల్లో మాయమవుతుంటారు. గంజాయి మత్తులో మహిళలు, యువతులను తాకుతూ వేధింపులతో నరకం చూపిస్తుంటారని ఐటీ నిపుణురాలు వాపోయారు. హిజ్రాల రూపంలో చేరి డబ్బు డిమాండ్ చేయటం, ఇవ్వని వారిపై దాడికి తెగబడటం చేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఒంటరిగా కనిపిస్తే అంతే సంగతులు! : ఎంఎంటీఎస్ రైళ్లలో పోలీసు రక్షణ చర్యలు లేకపోవటంతో దొంగలు చెలరేగిపోతున్నారు. డబీల్‌పుర సమీపంలో మహిళా కోచ్‌లోకి దూరిన యువకులు వికృతంగా ప్రవర్తించి భయాందోళనకు గురిచేసినట్టు సమాచారం. ఎంఎంటీఎస్‌లో మహిళా కోచ్‌ల్లో మహిళా పోలీసులను నియమించారు. అధిక శాతం ఆర్పీఎఫ్ సిబ్బంది జోనల్, ప్రధాన కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి 8 గంటలు దాటితే మేడ్చల్ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
హైదరాబాద్‌లో | |
ఎంఎంటీఎస్‌లు | 93 |
ప్రయాణికులు | 50 వేలు |
ఐటీ ఉద్యోగులు | 4 వేలు |
రాకపోకల సమయం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 :55 గంటల వరకు |
ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచారయత్నం ఘటన నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రైల్వే డీజీ రమేష్ నాయుడు, ఎస్పీ చందనాదీప్తి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ డీఎస్పీ జావేద్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ ప్రత్యేక బృందాలను పర్యవేక్షిస్తున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలో ఇద్దరు చొప్పున షీటీంతో పాటు మఫ్టీలో మరో ఇద్దరు చొప్పున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
MMTSలో యువతిపై అత్యాచారయత్నం - పోలీసుల అదుపులో అనుమానితుడు
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలు ఘటన - 'అతి తొందరలో నిందితున్ని పట్టుకుంటాం'