Microsoft co Founder Bill Gates Letter to CM Chandrababu: ఆధునిక సాంకేతికత, నూతన ఆవిష్కరణలతో పాలనను బలోపేతం చేయడం, మరింత సులభతరంగా సేవల్ని అందించి ప్రజాజీవితాల్ని మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు తపన, కృషి స్ఫూర్తిదాయకమని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్-మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ కృషి భారత్‌తో పాటు అల్ప, మధ్యాదాయ దేశాలకూ ఉపయోగకరమని వెల్లడించారు. భవిష్యత్తులో తాను ఏపీలో పర్యటించే నాటికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్సాహంతో కృషి: రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి గేట్స్ ఫౌండేషన్-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌కే కాక భారత్‌తో పాటు అల్ప, మధ్యాదాయ దేశాలకూ ఎంతో ఉపయోగపడనుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తెలిపారు. ఈ లక్ష్య సాధన దిశగా తాము ఉత్సాహంతో కృషి చేస్తున్నట్టు వివరించారు.
ప్రజలకు సులభతరంగా సేవలు: కీలక రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలు కనుగొనడం, ప్రజలకు సులభతరంగా ఆయా సేవల్ని అందించే అంశాలపై ఈ ఏడాది మార్చిలో దిల్లీ వేదికగా చంద్రబాబు, బిల్‌గేట్స్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరువురి సమక్షంలో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. దిల్లీలో ఇరువురి మధ్య చర్చలు ఆలోచనాత్మకంగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సాగాయని చెప్పారు. అందుకు చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.
గొప్ప అవకాశం: రాష్ట్రంపై చంద్రబాబు విజన్ తెలుసుకునేందుకు ఈ సమావేశంతో తనకు మరింత అవకాశం లభించిందని బిల్‌గేట్స్ అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిర్ణయాలు తీసుకునే విధానాలు, రియల్‌టైం డేటా, మానవవనరుల అభివృద్ధిపై మీరు పెడుతున్న దృష్టి ప్రగతిశీల ఆలోచనలకు, వాస్తవాలతో కూడిన నాయకత్వానికి నమూనాగా భావిస్తున్నట్లు వెల్లడించారు. హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్ ద్వారా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలనే సీఎం ప్రణాళికలు ఆసక్తికరంగా అనిపించాయని చెప్పారు.
వ్యవసాయంలో ఏఐ సలహాలు పాటించడం, నాణ్యమైన విత్తనాల వినియోగం, భూసార, భూ ఆరోగ్య పర్యవేక్షణ రైతుల ఉత్పాదకతను, వ్యవసాయ స్థిరత్వాన్ని మెరుగుపరచగలవని స్పష్టం చేశారు. గర్భిణులు, చిన్నపిల్లల ఆరోగ్య రక్షణకు మల్టిపుల్ మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంట్లు తదితరాలు ఎలా ఉపయోగపడతాయో చర్చించినందుకు ఆనందంగా ఉందన్నారు.
ఎదురుచూస్తున్నా: తాను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే నాటికి ఈ ఒప్పందంలోని లక్ష్యాల్ని సాధించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాకారం కానున్నాయని బిల్‌గేట్స్ తెలిపారు. మెడ్‌టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి చంద్రబాబు చూపుతున్న శ్రద్ధతో పేదలకు అత్యంత నాణ్యత కలిగిన పరికరాలు అతి తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ రంగంలో మన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు తాము ఎదురుచూస్తున్నామని చంద్రబాబుకు రాసిన లేఖలో బిల్‌గేట్స్ వెల్లడించారు.
2047 నాటికి ప్రపంచంలో టాప్ 2 నగరాల్లో హైదరాబాద్, అమరావతి: చంద్రబాబు
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు: సీఎం చంద్రబాబు