Life changing Useful Micro Habbits : జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందంగా గడపాలి. ఎవరైనా ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది చెప్పండి? దానికోసం ఏళ్ల కొద్దీ కష్టపడుతుంటాం కదా! ఇదంతా అవసరం లేదంటున్నాయి కొన్ని మైక్రో అలవాట్లు. వీటిని చేయడానికి పట్టేదీ కొన్ని నిమిషాలే! అసలు మైక్రో అలవాట్లు అంటే ఏంటంటే?
లైఫ్‌లో ఇది చేయాలి, దీన్ని సాధించాలంటూ బోలెడు ప్రణాళికలు, లక్ష్యాలు పెట్టుకుంటాం. కొన్నిరోజులకే వాటిని పక్కన పెట్టేస్తుంటాం. చాలా వరకూ దీనికి కారణమేంటో తెలుసా? సరైన స్ఫూర్తి లేకపోవడమే. ఒక్కసారిగా పెద్దమార్పులు జరిగినప్పుడు మనకి మనమే అంగీకరించలేం. అందుకే మధ్యలో ఆపేయడం, ఆ తరవాత నిరాశకు గురవ్వడం మొదలవుతుంది. వాటిని దూరం చేసేవే ఈ మైక్రో హాబిట్స్.
ఇవన్నీ ఉదాహరణలే! : మీ ఆసక్తి ఉన్న పనిలో జోడించుకుంటూ వెళ్లొచ్చు. అయితే వాటిని కొనసాగించగలగాలి మరి. అప్పుడే దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోగలుగుతారు. పైగా ఇలా చేయడం వల్ల మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు మైక్రో అలవాట్లు చేసుకుంటారా మరి?
కాస్త ఆగండి : దేనికైనా ప్రతిస్పందించేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు రెండుసార్లు గట్టిగా ఊపిరి తీసుకోండి. ఓ తప్పు నిర్ణయం, ఒక చిన్న మాట చాలు మనం జీవితాంతం బాధపడేలా చేయడానికి. అందుకే సందర్భమేదైనా కావచ్చు, ఇలా దీర్ఘశ్వాస తీసుకునే వదలండి. భావోద్వేగాలు, ఒత్తిడి మన అదుపులోకి వచ్చి, స్పష్టంగా ఆలోచించగలుగుతాం.
బెడ్ సరిచేశారా? : రోజూ ఈ పని మాదేగా అనే ఫీలింగ్‌కి రావద్దు. లేవగానే కనీసం మీరు కప్పుకున్న దుప్పటినైనా మడతపెట్టడం అలవాటు చేసుకోండి. మహా అయితే దీనికి పట్టేది రెండు, మూడు నిమిషాలే కానీ రోజు ఓ పద్ధతి ప్రకారం మొదలైందన్న అనుభూతి మనసులో కలుగుతుందట. తర్వాతి పనులను ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. పని అంతా పూర్తయ్యాక వచ్చి చూసుకున్నా నీట్‌గా ఉన్న మంచం కలిగించే హాయే వేరు.
పనులు ఆపి : చాలా మంది ఆడవాళ్లు నిద్ర లేవడమే లేటు వంటింట్లోకి నేరుగా దూరిపోతారు. ఇక ఆ క్షణం నుంచి హడావుడి, దాంతోపాటు వారిపై తీవ్ర ఒత్తిడి మొదలవుతుంది. ఇలా కాకుండా పనులు ఆపి, అలా ఆరు బయటికి వెళ్లి కళ్లు మూసుకుని చల్లగాలిని ప్రశాంతంగా ఆస్వాదించండి. ఆ క్షణమే కాదు, ఆ రోజంతా ఆనందంగా ఉండటానికి ఇదో ఆరోగ్య మంత్ర.
రోజూ ఒక్కటి : జీవితంలో కృతజ్ఞత చెప్పుకొనే విషయాలు బోలెడుంటాయి. ప్రత్యేక సందర్భం వస్తే తప్ప వాటిని ఆలోచించేదెవరు? రోజూ మీకు నచ్చిన సమయంలో మీరు వేటి గురించి లేదా ఎవరి పట్ల కృతజ్ఞతతో ఉన్నారో ఒక పేపరుపై రాయండి. రాసింది మళ్లీ రాయొద్దు. కావాలంటే గతంలో రాసిన వ్యక్తే తిరిగి సాయం చేస్తే మాత్రం రాయొచ్చు. ఇది మెదడు సానుకూల అంశాలపై దృష్టిపెట్టేలా పని చేస్తుంది. అంతేకాదు ఈ సమయంలో విడుదలయ్యే సెరటోనిన్ హార్మోన్ తృప్తినీ, భద్రతా భావాన్నీ మనసుకు కలిగిస్తుందట.
స్ట్రెచ్ చేయండి : ఉద్యోగినుల గురించి ఆఫీసుకొస్తే కుర్చీ వదలరు అని అంటుంటారు. ఇంట్లోనైనా గంటలకొద్దీ కూర్చొని పని చేయడం అనారోగ్య అలవాటే అవుతుంది. ప్రతి గంటకీ అలా పది అడుగులు వేయడమో కుర్చీలోనే తేలికపాటి స్ట్రెచెస్‌కు ప్రయత్నించడమో చేయాలి. శరీరానికే కాదు మనసుకీ ఇది వ్యాయామమేనట. పైగా తరవాత మరింత జోష్‌తో పనిచేస్తారు.
కాసేపు పక్కన పెట్టండి : ఇప్పుడు ఫోన్ లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎప్పుడు చేతిలోనే అంటిపెట్టుకుని ఉంటుంది. కానీ దానికీ కొద్దీ బ్రేక్ ఇవ్వండి. రోజంతా ఇవ్వడం కుదరకపోతే కనీసం తినేటప్పుడు, పడకగదిలోకి తీసుకెళ్లొద్దన్న నిబంధన పెట్టుకోండి. ఈ సమయంలో కుటుంబంతో గడిపితే అసంతృప్తులు దూరమవ్వడమే కాదు అనుబంధాలూ చాలా బలంగా దగ్గరవుతాయి.
మీకు తెలుసా? : ఇప్పుడంటే మహిళలు సులువుగా వరల్డ్ టూర్స్ చేసేస్తున్నారు. కానీ, సరైన రవాణా వ్యవస్థ లేని కాలంలోనే ఫ్రాన్స్‌కు చెందిన జెన్నీ బారెట్ అనే మహిళ 1766-1769ల్లో సముద్ర ప్రయాణం చేసి ప్రపంచాన్ని చుట్టేశారు. ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే, ఆ సమయంలో పురుషుడిలా ఆహార్యాన్ని సైతం మార్చుకున్నారు.
"విజయవంతమైన భవిష్యత్తు నిర్మాణంలో మనల్ని మనం నమ్మడమే తొలి అడుగు. ఆపై ఒక అర్థవంతమైన లక్ష్యాన్నిపెట్టుకుని, ఆత్మ విశ్వాసంతో ముందుకు ప్రయాణించాలి. మీ లక్ష్యం ఉత్తమ గృహిణిగా ఉండటమైనా, బిజినెస్ మ్యాగ్నెట్ కావడమైనా ఆ ప్రయత్నం నిరంతరంగా ఉండాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మధ్యలో అస్సలు ఆగకూడదు" -సవిత బాలచంద్రన్, సీఎఫ్‌ఓ, టాటా టెక్నాలజీస్