Massive Traffic Jam on Kaleshwaram Route : వారాంతం కావడంతో కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి ప్రజలు పోటెత్తుతున్నారు. పుష్కరాలు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. ప్రైవేట్ వాహనాలు భారీ ఎత్తున రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మద్దులపల్లి-కాళేశ్వరం మార్గమధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాళేశ్వరానికి సమీపంలో 8 కిలో మీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. 4 గంటలుగా ట్రాఫిక్‌జామ్ కావడం, తాగునీరు సౌకర్యం లేక భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రైవేటు వాహనాలలో : భక్తులు భారీగా బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలలో కాళేశ్వరం చేరుకుంటున్నారు. వ్యక్తిగత వాహనాలతో రద్దీ పెరగడంతో అన్నారం మూల మలుపు వద్ద, కాళేశ్వరం, మహాదేవపూర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కలుగజేసుకుని ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. నడుచుకుంటూ రావడానికి దారి మధ్యలో తాగునీటి సౌకర్యాలు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు దూరంలో చేయడంతో అక్కడి నుంచి కాలినడకన భక్తులు నడవాలంటే ఇబ్బందిగా ఉందని భక్తులు వాపోతున్నారు.
'3,4 కిలోమీటర్ల నుంచి మహిళలు, పిల్లలు ఎలా నడుస్తారు, ఇంత మంది వస్తున్నప్పుడు వారికి సరైన ఏర్పాట్లు చేయాలి కదా, ఈ ఎండకు తాగేందుకు ఏం దొరకడం లేదు' - భక్తుడు
'ఎండకు అల్లాడిపోతున్నాం, బస్సులు రద్దీగా ఉన్నాయి. ఆ బస్సుల్లో రావడం కష్టంగా ఉంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి' - భక్తురాలు
'పార్కింగ్ నుంచి ఇక్కడకు రావడానికి బస్ ఏర్పాటు చేశారు కానీ వాటిలో రద్దీ ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి పిల్లలను ఇక్కడకు తీసుకురావడం కష్టంగా ఉంది. ఏర్పాట్లు ఏం బాగా లేవు' - భక్తుడు
కాళేశ్వరంలో భారీ వర్షం కురవడంతో ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రాంతంలో మొత్తం నీరు చేరి ఇబ్బంది జరుగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఆ ఇబ్బందిని కలుగకుండా మరో ప్రాంతానికి తరలించి ఎప్పటికప్పుడు వాహనాలను సాఫీగా సాగేలా చూస్తున్నామని, భక్తులు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలని అన్నారు.
'ఆర్టీసీ బస్టాండ్ నుంచి సరస్వతి ఘాట్ వరకు ఉచితంగా షటిల్ బస్సులు ఏర్పాటు చేశాం. రద్దీకి తగ్గట్లుగా వేర్వేరు ప్రాంతాల నుంచి 85 బస్సులు నడుపుతున్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులు ఉచితంగా ఈ సేవలు వినియోగించుకోవచ్చు' - రాహుల్ శర్మ, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్
భక్తులతో కిటకిట : కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు తెలంగాణ వారే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో త్రివేణీ సంగమం భక్త జన సంద్రంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుష్కర ఘాట్‌లకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు కోటిన్నర మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు.
సరస్వతి ఘాట్‌లో సాయంత్రం జరుగుతున్న కాశీ పండితుల సరస్వతీ నవరత్న మాల హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా హారతిని భక్తులు నిండి కనులతో వీక్షించి తన్మయత్వం చెందుతున్నారు. సోమవారంతో(మే 26) సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి. వారాంతాలు కూడా కలసి రావడంతో భక్తుల తాకిడి పెరుగుతోంది.
భారీ వర్షంతో కాళేశ్వరం పరిసరాలు బురదమయం - ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మరో 6 రోజుల్లో సరస్వతీ పుష్కరాలు - ప్రత్యేక ఆకర్షణగా చదువుల తల్లి విగ్రహం, జ్ఞాన దీపం