Marriage To Mango Trees In Thungur of Jagtial District : మనుషులకు వివాహాలు కావటం సర్వసాధారణమైన విషయం. మనుషులకే కాకుండా కొన్ని ప్రాంతాల్లో మూగజీవాలకు పెళ్లిళ్లు చేయడం చేయటం చూస్తుంటాం. అలాగే వేప చెట్టుకు, రావి చెట్టుకు శాస్ట్రోక్తంగా పెళ్లి జరిపించడం చూశాం. ఓ రైతు దంపతులు మాత్రం మామిడి చెట్లకు వివాహం చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,
అన్నదాతలు పంటలు బాగా పండి అధిక దిగుబడులు రావాలని దేవుడికి వివిధ రకాల పూజలు చేస్తూ ఉంటారు. పంటలను ఇంట్లో వ్యక్తిగా భావిస్తారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూరులో ఓగుల అనిల - అజయ్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం మామిడి తోట సాగు చేయడం ప్రారంభించారు. ఈ తోటను వారు కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం మామిడి తోట కాపుకొచ్చింది.
దీంతో కాత కాసిన రెండు మామిడి చెట్లకు పెళ్లి చేశారు ఆ దంపతులు. పెళ్లి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకుడు వొద్దివర్తి మధుకుమారాచార్యుల ఆధ్వర్యంలో మామిడి చెట్లకు నూతన వస్త్రాలు ధరింపజేసి, జీలకర్ర, బెల్లం ఉంచి మాంగళ్యధారణ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని పలువురు రైతులు హాజరయ్యారు. కేవలం పెళ్లి మాత్రమే కాదు వచ్చిన అతిథులకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.
"మన హిందూ ధర్మం ప్రకృతి పూజించమని చెబుతుంది. రైతులు ప్రకృతిని పూజిస్తారు. ఓగుల అజయ్ - అనిల దంపతులు ఎనిమిది ఎకరాల్లో మామిడి తోట సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికిరావడంతో మొట్టమొదటిసారిగా మామిడి పండ్లను దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నారు. అందులో భాగంగా మామిడి చెట్లకు వివాహం జరిపించారు."- వద్దిపర్తి మధు కుమారాచార్యులు, శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకుడు