Funeral of Maoist Leader Sudhakar At Eluru District : మావోయిస్టు అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగి నెల రోజులు గడవకముందే ఆ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల బీజాపుర్ జిల్లాలో జాతీయపార్కు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం మృతి చెందారు.
మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు తెంటు వెంకట లక్ష్మీనరసింహాచలం ఎలియాస్ సుధాకర్(65) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలులో సోమవారం జరిగాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకులు, మావోయిస్టు సానుభూతిపరులు, పలు ప్రజాసంఘాల నాయకులతోపాటు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, ఇఫ్టూ, సీపీఎం నాయకులు, విప్లవ గేయకారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. తొలుత వీరంతా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఉద్యమ నాయకులు హాజరవుతారని భావించి పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అయితే కీలక నాయకులు రాలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఆదివారం రాత్రి సుధాకర్ మృతదేహాన్ని ఆయన సోదరుడు ఆనందరావు సత్యవోలుకు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం ప్రజల సందర్శన అనంతరం 11 గంటలకు గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. సుధాకర్ చితికి ఆనందరావు నిప్పంటించారు.
అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకులు రవి, భరద్వాజ, పాండురంగారావు, సాంబమూర్తి, పద్మ, శ్రీమన్నారాయణ, దళం మాజీ సభ్యుడు నార్ల రవి, ఖమ్మంకు చెందిన చిత్రా రవి, మాచర్ల మోహనరావు, ఝాన్సీ, ఇఫ్టూ నాయకులు పోట్రు ప్రసాద్, దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు మహంకాళితోపాటు సీపీఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు, సుధాకర్ కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు.
మరోవైపు ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన సజ్జా నాగేశ్వరరావు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్ - ఇ - జంగ్ ఎడిటోరియల్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్ననాగేశ్వరరావు అలియాస్ రాజన్న అలియాస్ ఏసన్న, అలియాస్ నవీన్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
36 ఏళ్లుగా అజ్ఞాత జీవితం - ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నాగేశ్వరరావు మృతి
కుటుంబ సభ్యులకు దూరంగా - మావోయిస్టు అగ్రనేత సుధాకర్ స్వస్థలం ఇదే!