ఆహారపు అలవాట్లలో మార్పులు - మిల్లెట్స్ రుచులకు ఫిదా అవుతున్న ప్రజలు
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పాకిన మిల్లెట్స్ సంస్కృతి - నూడిల్స్, దోశ, ఇడ్లీ, వడ, పకోడీ, బిర్యానీ వంటి వివిధ రకాల రుచులను ఆస్వాదిస్తున్న ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 11, 2025 at 2:15 PM IST
Many People Like To Eat Different Types Of Millets Food : ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పుడిదే అందరి ఛాయిస్. మెనూలో మిల్లెట్స్‌కే అగ్రతాంబూలం. అందుకే నిన్నమొన్నటి వరకు పెద్ద రెస్టారెంట్లకే పరిమితమైన చిరు ధాన్యాల విందులు ప్రస్తుతం వీధుల్లోని చిన్న హోటళ్లలోకీ వచ్చేశాయి.
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలకు, పేద ప్రజలకు ఆహారంగా ముద్రపడిన ‘చిరుధాన్యాలు’ ఇప్పుడు నగరవాసుల ప్లేట్లలోకి ఆరోగ్యకరమైన ఎంపికగా ప్రవేశించాయి. జంక్‌ఫుడ్ తెచ్చిన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు, పాతకాలపు ధాన్యాల వైపు ఆశగా చూస్తున్నారు. మట్టిబెడ్డల్లోంచి జన్మించే ఈ చిరుధాన్యాలు మన నగరాల వీధుల్లోని అనేక హోటళ్లలో దర్శనమివ్వడం ఆరోగ్య విప్లవానికి సంకేతం.

భిన్నంగా ఆలోచిస్తున్న ప్రజలు : నగర జీవితం ఒత్తిడితో కూడుకున్నది. దీనికితోడు పిజ్జాలు, బర్గర్‌ల వంటి ఫాస్ట్‌ఫుడ్ వినియోగం అధికం కావడంతో మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు సహజసిద్ధమైన, పోషక విలువలున్న ఆహారం వైపు దృష్టిసారిస్తున్నారు. పొద్దున్నే టిఫిన్‌లోకి ఉప్మా, మధ్యాహ్నం లంచ్‌లోకి కిచిడీ, సాయంత్రం చిరుతిళ్లయినా, రాత్రి డిన్నర్ అయినా రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తున్నారు ప్రజలు! భోజనంలోకి చిరుధాన్యాలను చేర్చుకుంటున్నారు.

ప్రస్తుతం చిన్నస్థాయి పట్టణాలకు సైతం ఈ మిల్లెట్స్ సంస్కృతి పాకింది. ఒకప్పుడు మిల్లెట్స్ అంటే ‘అబ్బా రుచి బాగోదు’ అనే ఫిర్యాదువచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నూడిల్స్, దోశ, ఇడ్లీ, వడ, పకోడీ, బిర్యానీ వంట ఏదైనా చిరుధాన్యాలను రుచిగా వండి వార్చేస్తున్నారు. ‘అబ్బబ్బే వద్దు’ అన్నవారే ఇప్పుడా రుచులకు ఫిదా అయ్యి లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు.

ఆధునిక భోజనంలో మిళితమై : కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, సజ్జలు, రాగులు, జొన్నలు ఆధునిక భోజనంలో మిళితమై తినేవారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. తొలుత జంతికలు, చెకోడీలు, మురుకులు వంటి తినుబండారాలకు మిల్లెట్స్‌ను వాడటం మొదలుపెట్టినా, ఇప్పుడు భోజనంలో ఇవి ముఖ్య భాగమయ్యాయి. ఇన్‌స్టంట్ వంటకాల్లోనూ ఇవి కనిపిస్తున్నాయి. రెస్టారెంట్ మెనూల్లో రాగి ఇడ్లీ, మిల్లెట్స్ కిచిడీ సాధారణమైపోయింది. రాగి ముద్ద, నాటుకోడి కూరకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు.

హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో చిరుధాన్యాలతో అల్పాహారం అందించే వాహన రెస్టారెంట్లు క్రమేణా పెరుగుతున్నాయి. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా వాటిని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. టాప్ బ్రాండ్స్ కూడా ఈ వ్యాపారం మీద దృష్టి పెట్టడంతో తినేవారికి నాణ్యమైన సేవలు అందుతున్నాయి.

పలావు, పెరుగన్నం : కొవిడ్ తర్వాత ఆహారపు అలవాట్లలో మార్పులు అనివార్యమయ్యాయి. చిరుధాన్యాల వినియోగం బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మిల్లెట్స్ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాళ్లు పెద్దఎత్తున పుట్టుకొచ్చాయి. హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసిన పి.నర్సింగ్ విశాఖలో ‘మన అరకు మిల్లెట్స్ అండ్ మోర్’ పేరుతో రెస్టారెంట్ నడుపుతున్నారు. అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లోని అరకు, పాడేరు, విజయవాడ, నిజామాబాద్, అదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి చిరుధాన్యాల గురించి తెలుసుకున్నారు.

చిరుధాన్యాల సాంబరన్నం, పలావు : అనంతరం వాటితో వంటల తయారీపై శిక్షణ తీసుకొని రంగంలోకి దిగారు. అరికెలు, రాగులు, జొన్నలతో ఇడ్లీ, కొర్రలతో దోసెలు చేస్తున్నారు. కొత్తలో రోజుకు 50 మంది రావడం గగనమయ్యేది. క్రమేణా వినియోగదారులు పెరిగారు. మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాల సాంబరన్నం, పెరుగన్నం, పలావు కావాలని అడగడంతో త్వరలోనే ప్రారంభించాలని చూస్తున్నారు. ప్రయోగాత్మకంగా కొర్రలు, జొన్నలు, ఊదలతో చద్దన్నం తీసుకురావాలని చూస్తున్నారు.
గుంటూరుకు చెందిన సుధీర్ ‘వాసెనపోలి’ పేరుతో విశాఖలో చిరుధాన్యాలతో చేస్తున్న ఆవిరి కుడుములకు ఎంతో పేరుంది. అన్ని రకాల ఇడ్లీలను అడ్డాకుల్లో ఉంచి ఆవిరి మీద ఉడికిస్తారు. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ వచ్చిన ప్రతిసారీ అక్కడి నుంచి ఇడ్లీలు ప్రత్యేకంగా తెప్పించుకొని తింటారు.

కోరినన్ని రుచులు : ఇప్పుడు చాలాచోట్ల మిల్లెట్స్‌తో యువత, పిల్లల కోసం పిజ్జా, బర్గర్లు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. కొన్నిచోట్ల బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అమ్ముతున్నారు. కొర్రలతో వడలు, రాగులతో కోవా, సజ్జలతో పొంగలి, హల్వా, పాయసం చేస్తున్నారు. సజ్జలు, కొర్రలు, సామలతో చికెన్ బిర్యానీని ప్రజలు ఇష్టంగా తింటున్నారు. వీటితో వ్యాధినిరోధకశక్తి పెరగడం, మూత్ర, జీర్ణసంబంధ వ్యాధులు దరిచేరవని తెలియడంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.
" ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు చాలా ముఖ్యం. ఈ 5 రకాల పోషకాలు ఉండే ఆహారం సమతుల్యంగా ఉంటుంది. డయాబెటీక్ ఉన్నవారిలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు చిరుధాన్యాలు, పీచు పదార్ధాలు తీసుకోవాలి. కొర్ర అన్నం తీసుకోవడం మంచిది. జీవనశైలిలో ఆహార పదార్థాల్లో మార్పు చేసుకోవడం తప్పనిసరి " - డాక్టర్ సాయిపల్లవి, న్యూట్రీషియన్
" 50, 60 ఏళ్ల కిందట మిల్లెట్స్‌నే ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. కాలక్రమంలో బియ్యం, గోధుమలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. ఇటీవల కాలంలో మళ్లీ మిల్లెట్స్ వైపు చూస్తున్నారు. వీటిని ఆహారంగా తీసుకునే వారిలో చాలామంది అరుగుదల సమస్య ఎదురవుతుందని, కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందని మా దగ్గర ప్రస్తావిస్తుంటారు. నిజానికి వీటిని తినడం వల్ల ఎలాంటి అజీర్తి సమస్యలు రావు. కొంచెం తినగానే ఎక్కువ తిన్నామనే భావన రావడం కూడా మంచిదే. తద్వారా తక్కువ మోతాదులో తింటారు. తీసుకునే క్యాలరీల మోతాదు తగ్గుతుంది. నాలుకకు రుచించని ఆహారంలోనే వాస్తవానికి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో షుగర్ స్థాయులు తక్కువగా ఉండాలంటే మిల్లెట్స్ వాడకం మంచిది." - డా.రాకేష్ కలపాల, ఏఐజీ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
" జీవనశైలి వ్యాధులను నివారించడం, అరికట్టడంలోనూ తృణ ధాన్యాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే ఎక్కువగా ప్రాసెసింగ్ చేస్తే అందులోని పోషక విలువలు తగ్గిపోతాయి. అందుకే సులువైన విధానాల ద్వారా ఎక్కువగా ధాన్యం పైపొర తొలగిపోకుండా వాడుకునే పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నానబెట్టి ఉడకబెట్టి తింటే మంచిది. తద్వారా పోషక విలువలు తగ్గిపోవు, అజీర్తి సమస్యలూ ఎదురుకావు. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నా అంతగా ఆదరణ లభించకపోవడానికి ప్రధాన కారణం వండుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం!. పీచును కూడా మోతాదుకు మించి తినడం శ్రేయస్కరం కాదు. జీర్ణవ్యవస్థ పనితీరును బట్టి రోజుకు ఒకటి, రెండుసార్లు మిల్లెట్స్‌ను తీసుకోవచ్చు." - డా.లతాశశి, ఫెర్నాండేజ్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్
" పూర్వకాలం నుంచీ తృణధాన్యాలను రైతులు పండించేవారు. వాళ్లే తినే వారు. అవి ఎప్పుడూ వాణిజ్య పంటలుగా గుర్తింపు పొందలేదు. ముఖ్యంగా వీటిని ఆహారాలుగా వినియోగించేందుకు అనువైన ప్రక్రియలు పెద్దగా అందుబాటులేవు. గోధుమ పిండితో చపాతీలు ఎంత తేలిగ్గా చేయగలుగుతారో అంత సులువుగా మిల్లెట్స్‌తో వంటకాలు చేయడంపై అవగాహన లేదు. వీటి వల్ల పోషక విలువలు పెరగడంతో పాటు జీవనశైలి వ్యాధుల బారినపడకుండా కూడా జాగ్రత్తపడొచ్చు. భూతాపం వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులతో వర్షాలు తగ్గిపోతున్నాయి. ఈ స్థితిలో తక్కువ నీటి వనరులతో పండించే మిల్లెట్స్‌కు ఆదరణ ఉంటుంది. భవిష్యత్‌లో ఒకవేళ వరి, గోధుమల కొరత ఏర్పడినా తృణ ధాన్యాలతో ఆహార భద్రత లభిస్తుంది." - డా.బి.దయాకర్‌రావు, ఐఐఎంఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, హైదరాబాద్

రైతులకు ప్రభుత్వం చేయూత - మిల్లెట్స్ సాగుకు ఉచితంగా విత్తనాలు
ఈ కొలతలతో చేస్తే "జొన్న అన్నం" తయారీ ఈజీ! - ఈ రైస్ వేసవిలో ఒంటికి చలువ చేస్తుంది!

