Social Media Affect on Childrens : పసిప్రాయంపై అశ్లీలత తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. తెలిసీ తెలియక అశ్లీల వీడియోలు చూస్తున్న పిల్లలు క్రమంగా వాటికి బానిసలుగా మారిపోతున్నారు. కనీస వయసు, అవగాహన లేకుండానే శృంగారం, ఇతర అంశాల గురించి తెలుసుకోవడం వల్ల తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తోంది. పిల్లల్లో విపరీత మార్పులు చూస్తున్న తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు.
- హైదరాబాద్ నగరానికి చెందిన దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. వారికి 13 ఏళ్ల ఓ కుమారుడు ఉన్నాడు. అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూడటం ప్రారంభించాడు. గంటలకొద్దీ అలాగే అశ్లీల వీడియోలు చూస్తుండటంతో అది అలవాటుగా మారింది. ఇటీవల నిద్రలో ఉలిక్కిపడటం, కలవరపాటుకు గురవుతుండటంతో తల్లిదండ్రులు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తీసుకొచ్చారు.
- హైదరాబాద్‌లోని ఓ ఆటో డ్రైవర్‌కు పోర్న్ వీడియోలు చూసే అలవాటుంది. రోజూ సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలకు ఫోన్ ఇచ్చేవాడు. కొద్ది రోజుల తర్వాత తన కుమారుడు కూడా అవే వీడియోలు చూస్తున్నట్లు ఆటో డ్రైవర్ గుర్తించాడు. ఇదేంటని బాలుడిని ప్రశ్నించగా, ఫోన్‌లో గేమ్స్ ఆడేటప్పుడు వచ్చిన నోటిఫికేషన్‌ను క్లిక్ చేసినట్లు చెప్పాడు. తండ్రి అలాంటివి చూడటంతోనే ఫోన్‌కు నోటిఫికేషన్లు వచ్చినట్లు తేలింది.
పట్టించుకోకపోవడమే పెద్ద సమస్య : కొందరు తల్లిదండ్రులు అతి గారాబంతో పుట్టిన రోజు, ఇంకా ఇతర సందర్భాల్లో ఫోన్లు, ట్యాబ్‌లు గిఫ్ట్‌లుగా ఇస్తున్నారు. వీడియో గేమ్స్, ఆన్లైన్ క్లాసులని భావిస్తున్నా, పరిస్థితి వేరుగా ఉంటోంది. సోషల్ మీడియాలు, ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు పొరపాటున పోర్న్ వీడియోస్ నోటిఫికేషన్లపై క్లిక్ చేస్తే నిరంతరం అవే వస్తుంటాయి. సోషల్ మీడియా ప్రభావంతో అశ్లీల వీడియోల గురించి స్నేహితులతో చర్చించడం, రకరకాల వెబ్‌సైట్లు తెలుసుకుని చూస్తూ ఆత్మన్యూనత, అభద్రతా భావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించకపోవడమే ఇందుకు అసలైన కారణమని పోలీసులు, మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- పిల్లలు ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లను ఎందుకోసం వాడుతున్నారో తెలుసుకోవాలి.
- పోర్న్ వెబ్‌సైట్లు, ఇతర కంటెంట్ నోటిఫికేషన్లు రాకుండా బ్లాక్ చేయాలి. చైల్డ్ లాక్ ఆప్షన్ కూడా వీటిలో ఉంటుంది.
- అశ్లీలం చూసే అలవాటున్న పిల్లలు తల్లిదండ్రులతో కలిసి నిద్రించడానికి అస్సలు ఇష్టపడరు. దీనిని మొదట్లోనే గుర్తించి వారితో మాట్లాడాలి.
- రోజువారి విధుల్లో భాగంగా తల్లిదండ్రులు ఎంత తీరిక లేకున్నా పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం మనసు విప్పి మాట్లాడాలి. స్నేహితుల్లా ప్రవర్తిస్తూ వారి మనసులోని భావాలను తెలుసుకోవాలి. ఏదైనా విషయంపై ధైర్యంగా చెప్పేలా వారిని ప్రోత్సహించాలి.
- సమాజంలో వివిధ రంగాల్లో సక్సెస్ఫుల్ వ్యక్తులు, ప్రముఖుల గురించి తరచూ చెబుతూ వారికి సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా పిల్లల్లో సానుకూల ధోరణి పెరగడంతో పాటు, మరిన్ని మంచి అలవాట్లు పెరుగుతాయి.
"పిల్లలకు మొబైల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దు. అన్నం తినడానికి మారాం చేస్తున్నారని చాలా మంది తల్లిదండ్రులు ఫోన్‌లో వీడియోలు చూపిస్తున్నారు. అనంతరం పిల్లలకు ఫోన్ అలవాటుగా మారుతుంది. సోషల్ మీడియాలు, ఇతర యాప్‌లను వాడేటప్పుడు అశ్లీల వీడియోల నోటిఫికేషన్లు వస్తున్నాయి. దాని వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలియక పిల్లలు అశ్లీలానికి అలవాటు పడుతున్నారు. మొబైల్ ఫోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి" -పి. నరేశ్ రెడ్డి, బాలానగర్ ఏసీపీ
OTT, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌పై మీ స్పందన చెప్పండి-కేంద్రానికి సుప్రీం నోటీసులు