Mango Farmers Problems in AP : మధురఫలం మామిడి రైతులకు చేదును మిగుల్చుతోంది. పంట కొనుగోలుకు గుజ్జు పరిశ్రమల యజమానులు ముందుకు రాకపోవడం, వ్యాపారులు రేటును తెగ్గోయడంతో చిత్తూరు జిల్లాలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోత నిలిపిస్తే కాయ రాలిపోతుందని కోత కోస్తే మార్కెట్‌లో అమ్మడుపోక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి సైతం తిరిగిరావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకుని తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
రాష్ట్రంలో మరే ప్రాంతంలో లేని రీతిలో చిత్తూరు జిల్లాలో రైతులు మామిడి పంట సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో ఇది సాగవుతోంది. జిల్లాలో ఉన్న గుజ్జు పరిశ్రమలకు అనువైన తోతాపురి మామిడి పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తుండగా బేనీషా, నీలం, మల్లిక, ఖాదర్, చెరకు రసాలు వంటి టేబుల్ రకాలను కొంత విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. గతంలో టేబుల్ వెరైటీ రకం బేనీషా ఆశించిన మేర ధర పలికి అన్నదాతలు లాభాలు పొందేవారు.
Mango Price Drop in Chittoor : ఈ ఏడాది బేనీషా రకం సైతం కనీస ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గుజ్జు పరిశ్రమలకు అనువైన తోతాపురి రకాన్ని జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పంటను గుజ్జు పరిశ్రమల యజమానులు కొనుగోలు చేయడానికి సవాలక్ష అంక్షలు విధిస్తుండటంతో నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. అకాలవర్షాలు, గాలులతో కొంత పంట రాలిపోతోందని మరికొంత పక్వానికి వచ్చిన ధరలు లేక కోయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుజ్జు పరిశ్రమలు తోతాపురి తీసుకోవడం లేదు. ర్యాంప్‌ల దగ్గర కిలో మామిడి కాయులు ఐదు నుంచి ఏడు రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారు. మా పరిస్థితి దారుణంగా ఉంది. సంవత్సరం పొడవునా చేసినా ఖర్చులు కూడా రావడం లేదు. కనీసం ఈసారి పెట్టుబడినా వస్తే చాలని ఉంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం. - రైతులు
ఓవైపు కాయలను కొనుగోలు చేసే వారు లేక , గిట్టుబాటు ధరలు దక్కక అవస్థలు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఆదాయం రాకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుజ్జు పరిశ్రమల్లో మామిడికాయలను కొనుగోలు చేయకపోవడంతో ప్రత్యామ్నాయంగా మామిడి మార్కెట్లకు తరలిస్తున్నారు. అధిక సంఖ్యలో పంట రావడంతో మండీలు ఎటుచూసినా కాయలతో నిండిపోయాయి.
దీంతో వ్యాపారులు, మండీ యజమానులు మామిడి పంటను తీసుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దుక్కి దున్నడం నుంచి పంట కోయడం వరకు ఒక కిలో మామిడి పంట తీయడానికి ఏడు రూపాయలు వ్యయమవుతందని చెబుతున్నారు. కనీసం ఐదు రూపాయలు కూడా ధర దక్కడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.
AP Govt Respond on Mango Price Drop : ఈ క్రమంలోనే మామిడి రైతుల సమస్యలపై ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. కిలో మామిడికి రూ.12 ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఆ రేటు కచ్చితంగా చెల్లించాలంటూ గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు చిత్తూరు కలెక్టరేట్‌లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంఘాలు, గుజ్జు పరిశ్రమల యజమానులు, వ్యాపారులు పాల్గొన్నారు. మామిడి రైతుల సమస్యలను ఎమ్మెల్యే మురళీమోహన్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు.
నిమ్మ ధర ఢమాల్ - ఆందోళనలో రైతులు
కలర్‌ఫుల్ బెండకాయలు - ఆకులో కలిసిపోయే గ్రీన్ కాటర్‌పిల్లర్!