Mangalagiri Court Remands TDP Activist Chebrolu Kiran For 14 Days : మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అతడికి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కోర్టుకి తరలించారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడు కిరణ్‌కు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యాయమూర్తి ఆగ్రహం : విచారణ సందర్భంగా మంగళగిరి గ్రామీణ సీఐపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేబ్రోలు కిరణ్‌పై 111 సెక్షన్ పెట్టడంపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు చార్జ్ మోమో ఇవ్వాలని, లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు.
తీవ్రంగా పరిగణించిన టీడీపీ : ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిని ఉద్దేశించి కిరణ్ చేసిన అసభ్య వ్యాఖ్యలను టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. అతడిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ వెంటనే మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో కిరణ్‌పై బెయిల్‌కు వీల్లేని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్‌కుమార్ ఉన్నట్లు గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు.
బెయిల్‌కు వీల్లేని సెక్షన్ల కింద కేసులు : నిందితుడు కిరణ్‌కుమార్‌పై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం (బీఎన్‌ఎస్ 79), వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రేరేపించడం (బీఎన్‌ఎస్ 196(1)), అనుచిత వ్యాఖ్యలు (బీఎన్‌ఎస్ 353(1)), నేరపూరిత కుట్ర (బీఎన్‌ఎస్ 61 (2)), వ్యవస్థీకృత నేరం (బీఎన్‌ఎస్ 111(1)), ఐటీ చట్టంలోని సెక్షన్ 67 (ఏ) వంటి బెయిల్‌కు వీల్లేని సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి అరెస్టు చేసింది. అరెస్ట్‌కు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ కిరణ్‌కుమార్ ఒక వీడియో విడుదల చేశారు. ‘వైఎస్ భారతిగారు నన్ను క్షమించండి. మహిళలు అంటే నాకు గౌరవం ఉంది. నేను ఇంటర్వ్యూలో అసభ్యకరంగా మాట్లాడినందుకు మీ కాళ్లు పట్టుకుంటూ క్షమాపణలు కోరుతున్నా’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.
వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు - టీడీపీ కార్యకర్త అరెస్ట్
వైఎస్ భారతిపై అసభ్యకర పోస్టులు - కిరణ్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు