Manchu Manoj Interview : ఇల్లు, ఇతర ఆస్తులపై తనకు ఏమాత్రం ఇష్టం లేదని మరోసారి సినీ నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు. వాళ్లు చేసిన కొన్ని పనుల వల్ల తన మనసు విరిగిపోయిందని అన్నారు. తన కుటుంబంలో జరుగుతోన్న వరుస వివాదాలను ఉద్దేశించి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో ఆయన మాట్లాడారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రశ్నించిన తరుణంలో ఈ గొడవలు మొదలయ్యాయని, సుమారు రెండేళ్ల నుంచి ఈ తగాదాలు నడుస్తున్నాయని మంచు మనోజ్ తెలిపారు. ఈ సమస్యలపై ప్రశ్నించాననే కారణంతో తన గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు వ్యాప్తి చేశారన్నారు. తనపై దాదాపు 30 తప్పుడు కేసులు పెట్టారని, కానీ తాను కుటుంబం కోసం ఎంతో చేశానని మంచు మనోజ్ అన్నారు. ఆస్తిలో ఒక్క రూపాయి కూడా కోరుకోలేదని స్పష్టం చేశారు.
తమ నాన్న సినిమాలు అన్నింటికీ తమ అన్నకు సంబంధించిన సంస్థలే పని చేస్తాయని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. సన్నాఫ్ ఇండియాలోని ఒక పాట గ్రాఫిక్స్‌కు సుమారు రూ.కోటిన్నర ఖర్చు చేశారని, దానిని మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చేసెయొచ్చని వివరించారు. ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవల్లోకి తన భార్యను లాగారని, అలా చేయకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదన్నారు.
తన వల్లే చెడిపోతున్నానంటూ స్టేట్మెంట్, ఎఫ్ఐఆర్లో తన భార్యాబిడ్డల పేర్లు పెట్టడంతో తన మనసు విరిగిపోయిందని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేయలేదని, ఆస్తి అడగలేదని, అందుకే దేనికీ భయపడనని మనోజ్ తెలిపారు. తనపై పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికే ఈ దాడులకు పాల్పడుతున్నారని మనోజ్ వాపోయారు.
కారు పోయిందని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు : మంగళవారం తన కారు పోయిందని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పాప పుట్టినరోజు వేడుకల కోసం తాను జయపుర వెళ్లడాన్ని అవకాశంగా తీసుకొని తన సోదరుడు విష్ణు ఈ గొడవ అంతటికీ కారణమయ్యారని ఆరోపించారు. దీంతో బుధవారం జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి ముందు మనోజ్ నిరసన వ్యక్తం చేశారు. గేటు వద్ద కూర్చొని తన పెంపుడు శునకాలు, మరికొన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాయని, వాటిని తీసుకోవడానికే వచ్చానని చెప్పారు. కానీ లోపలికి వెళ్లడానికి అనుమతించలేదని మీడియాతో తెలిపారు. తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తమది ఆస్తి గొడవ కాదని మంచు మనోజ్ చెప్పారు.
మంచు మనోజ్ కారు చోరీ - పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్
ఇది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం : మంచు మనోజ్