Actor Manchu Manoj in Ananthapuram : మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులకు, సమీపంలోని హోటల్ యజమానికి జరిగిన చిన్నపాటి ఘర్షణను తీవ్రంగా పరిగణించి విద్యాసంస్థల బౌన్సర్లు హోటల్ యజమాని, హోటల్‌పై దౌర్జన్యం చేయడం అమానుషమని సినీనటుడు మంచు మనోజ్ ఆరోపించారు.
దౌర్జన్యాలు జరగడం దురదృష్టకరం : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ(ఏంబీయూ) ముందు మీడియా విలేకర్లతో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందని, బౌన్సర్ల చేత కొట్టించడం, హోటల్‌ను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న విద్యాసంస్థల పరిసరాలలో దౌర్జన్యాలు చోటు చేసుకోవడం ఎంతో దురదృష్టకరమన్నారు.
"నా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న అంశం ఇది. నేను మళ్లీ చెప్తున్నాను ఇవి ఆస్తి గొడవలు కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. ఈ సమస్య ఇక్కడికి వచ్చే ప్రతి విద్యార్థిది. గతంలో హైదరాబాద్‌లో జరిగిన వివాదం గురించి తెలంగాణ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు బౌన్సర్ల సమస్యను చెప్పగానే వారు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు" -మంచు మనోజ్
ఆగడాలు ఎక్కువవుతున్నాయి : ఇవి ఆస్తి గొడవలు కాదని, ఆత్మగౌరవానికి సంబంధించినవని ఆయన అన్నారు. తన తండ్రి మంచు మోహన్ బాబు ఎంతో పవిత్ర ఆశయంతో విద్యాసంస్థలను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా విద్యాసంస్థలలో ఆగడాలు ఎక్కువవుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థల సమీపంలో పలువురు ఆస్తులు అమ్ముకొని వచ్చి వసతి గృహాలను, హోటళ్లు నడుపుకుంటున్నారని వారిపై దాడులేంటని ఆక్షేపించారు.
హేమాద్రి నాయుడే కారణం : ప్రస్తుతం బౌన్సర్ల సహాయంతో విద్యాసంస్థల లోపల బయట దౌర్జన్యాలు మితిమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహ నిర్వాహకులు, హోటల్ వారు భయబ్రాంతులకు గురవుతున్నట్లు తెలిసి వారికి మద్దతుగా వచ్చానని ఆయన తెలిపారు. బాధితులతో కలిసి న్యాయపోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. విద్యా సంస్థలలో జరుగుతున్న గొడవలకు విద్యాసంస్థల ఇన్ఛార్జ్ హేమాద్రి నాయుడే కారణమన్నారు. వీరిని కట్టడి చేయకపోతే మరింత ప్రజా ఆగ్రహం ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎమ్మెల్యేను కోరుతున్నా : ఈ విషయంపై దృష్టిసారించాలని స్థానిక ఎమ్మెల్యేను కోరుతున్నట్లు మనోజ్ తెలిపారు. ఇక్కడి ప్రజలకు ధైర్యం ఇవ్వండంటూ, పది మందికి సాయం చేయడం కోసమే నాన్న(మోహన్ బాబు) ఈ విద్యా సంస్థల్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యాసంస్థల మేనేజ్‌మెంట్ ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసునని చెప్పారు. దయచేసి బౌన్సర్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. హోటల్ యజమాని ప్రాణభయంతో పారిపోయారని ఆయనకు ఎన్నోసార్లు బెదిరింపులు వచ్చాయని మనోజ్ తెలిపారు.
రంగారెడ్డి కలెక్టరేట్లో మోహన్ బాబు, మనోజ్ - మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశం!
'నా ఆస్తులన్నీ దోచుకుంటున్నారు' - మనోజ్‌పై మోహన్‌బాబు ఫిర్యాదు