Man Dies After Falling Under RTC Bus : హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో భాగంగా బైకును ఆపే క్రమంలో ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే అతని తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయాడని వాహనదారులు ఆందోళనకు దిగారు. వాహనదారుల ఆందోళనలతో మూడు కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్ మార్గంలో భారీగా రాకపోకలు స్తంభించాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదానికి దిగిన వాహనదారులను పోలీసులు చెదరగొట్టారు.
వాహనాల తనిఖీలు : బాధితులు తెలిపిన వివరాల ప్రకారం షాపూర్ నగర్లో నివసించే జోషి బాబు కార్పెంటర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం జోషి బాబు, తన ద్విచక్ర వాహనం పై షాపూర్ నగర్ నుంచి బాలానగర్ వైపు వెళ్తున్నాడు. ఇంతలోనే ఐడీపీఎల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ జోషి బాబు వాహనాన్ని అడ్డగించి, నిలపాలని కోరగా అతను వాహనాన్ని ఆపకుండా వెళ్తున్న క్రమంలో జోషి బాబు చొక్కాను కానిస్టేబుల్ పట్టి లాగడంతో అదుపు తప్పి కిందపడిపోయాడు.
మృతికి కానిస్టేబుల్ కారణం! : అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసి బస్సు జోషి బాబు తలపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రంగా బాధితుడు గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని మిగతా వాహనదారులు జోషి బాబు మృతికి ట్రాఫిక్ కానిస్టేబుల్ కారణమంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో, పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ ఛార్జ్ చేశారు.
ఆందోళన తీవ్రతరమవుతున్న క్రమంలో సీసీ ఫుటేజీ పరిశీలించి, మృతికి కారణమైన వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ ఫ్లైఓవర్‌పై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - ప్రయాణికులకు గాయాలు