ETV Bharat / state

‘సైబర్‌’ బాధితుల్లో ప్రైవేట్ ఉద్యోగులే అధికం - కారణాలు ఏంటంటే?

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఘటనలపై విశ్లేషణలో వెల్లడి - రూ.681 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు - బాధితుల్లో అత్యధికంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే

Majority of Cybercrime Victims are Private Sector Employees
Majority of Cybercrime Victims are Private Sector Employees (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : August 4, 2025 at 1:36 PM IST

2 Min Read
Choose ETV Bharat

Majority of Cybercrime Victims are Private Sector Employees : రాష్ట్రంలో జరుగుతున్న సైబర్‌ నేరాల్లో అత్యధిక బాధితులు ప్రైవేటు ఉద్యోగులే ఉన్నారు. వీరిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. ఈ బాధితుల్లో ప్రైవేటు ఉద్యోగుల తర్వాత స్వయం ఉపాధి పొందుతున్న వారు, వ్యాపారులు అత్యధికంగా ఉంటున్నారు. ఈ సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో (జనవరి-జూన్‌) సైబర్‌ నేరాలపై వచ్చిన ఫిర్యాదుల తీరును సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విశ్లేషించినప్పుడు ఈ విషయం వెల్లడైంది.

అత్యధికంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే : రాష్ట్రంలో సైబర్‌ నేరాలకు సంబంధించి 37,928 ఫిర్యాదులు రాగా, వాటి ఆధారంగా 6,138 కేసులు నమోదు చేశారు. ఈ ఘటనల్లో నేరగాళ్లు రూ.681 కోట్లు కొల్లగొట్టారు. బాధితుల్లో 4,289 మంది ప్రైవేటు ఉద్యోగులు ఉండగా, వీరిలో 782 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నారు.

ఈ సైబర్​ నేరస్థుల చేతిలో మోసపోయినవారు :

  • స్వయం ఉపాధి పొందుతున్నవారు 1,355 మంది
  • 1,339 మంది వ్యాపారులు
  • 1,253 మంది విద్యార్థులు
  • 1,037 మంది గృహిణులు
  • 406 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.

గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో జాతీయస్థాయిలో సైబర్‌ నేరాలు 37% పెరగగా, రాష్ట్రంలో 13% తగ్గాయి. దీనికి ముఖ్య కారణం సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో చర్యలు తీసుకుంటుంది.

కారణాలివీ :

  • ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చు కుంటే ప్రైవేటు ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు నిత్య జీవితంలోనూ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
  • ఈ-కామర్స్‌ ద్వారా కొనుగోళ్లు తదితర అవసరాలకు ఎక్కువగా అంతర్జాలంపై ఆధారపడుతుంటారు. క్రెడిట్‌ కార్డులు ఎక్కువగా వాడుతుంటారు.
  • ఈ టెక్నాలజీపై ఆధారపడే వారిని సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగుల సంఖ్యా ఎక్కువగా ఉంది.

షేర్లలో పెట్టుబడి ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం వచ్చేలా చూస్తామంటూ, తక్కువ ధరకు వస్తువులు అమ్ముతామంటూ నేరగాళ్లు చేసే మోసాలకు వీరంతా బలవుతున్నారు. ఐడెంటిటీ థెఫ్ట్‌ అంటే క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాల వంటివి కొట్టేసి చేసే మోసాల బారినపడినవారిలోనూ వీరే అత్యధికంగా ఉన్నారు.

ఎవరెవరు సైబర్‌ నేరగాళ్లకు చిక్కుతున్నారు, ఎలాంటి నేరాల ద్వారా నష్టపోతున్నారో అధ్యయనం చేసి నివేదిక రూపొందించిన అధికారులు దీని ఆధారంగా ఆయా రంగాలవారికి అవగాహన కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు.

సైబర్​ నేరస్థుల అరెస్టులో 93 మంది తెలంగాణ వారే : ఈ ఏడాది ఇప్పటివరకు 27 మంది మహిళలు సహా మొత్తం 228 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి జులై 31 వరకు అరెస్టు చేసిన 228 మందికి దేశవ్యాప్తంగా జరిగిన 1,313లో తెలంగాణకు సంబంధించిన 189 నేరాలతో సంబంధం ఉందని తెలిపారు. అరెస్టయినవారిలో తెలంగాణకు చెందినవారు 93 మంది ఉన్నారని పేర్కొన్నారు. సైబర్‌ నేరగాళ్లను పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా మూడు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు డీజీ వెల్లడించారు.

విదేశీ ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా - వారితోనే సైబర్ నేరాలు

తెలంగాణలోనూ 'సైబర్​ డెన్'​లు! - మనలో ఒకడిగా ఉంటూనే మనల్నే దోచేస్తున్నారు