Major parties Camp politics: విశాఖ మహానగరపాలక సంస్థ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న తరుణంలో ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి. ఇప్పటికే వైఎస్సార్సీపీ పక్షం కర్ణాటక, కేరళతో పాటు శ్రీలంకలోనూ శిబిరాలు ఏర్పాటు చేసింది. టీడీపీ పక్షం కౌలాలంపూర్‌లో శిబిరం నిర్వహిస్తోంది. జనసేన పక్షం మాత్రం క్యాంపు రాజకీయాలకు దూరం పాటిస్తోంది.
క్యాంప్ రాజకీయాలతో తమ వ్యూహాలకు పదును: GVMC మేయర్ గోలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలతో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జీవీఎంసీ టీడీపీ పక్ష నేత పీలా శ్రీనివాసరావు కూటమి కార్పొరేటర్లతో కౌలాలంపూర్‌లో క్యాంపు నిర్వహిస్తున్నారు. వైసీపీ పక్షం ఇప్పటికే బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా పలుచోట్ల క్యాంపులు నిర్వహిస్తోంది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్ససత్యనారాయణ విశాఖలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లతో వ్యూహాన్ని నడుపుతున్నారు. విదేశీ పర్యటన పూర్తిచేసుకుని ఇటీవలే నగరానికి చేరుకున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, 11 మంది జనసేన సభ్యులతో సమావేశమై అవిశ్వాస పరీక్షపై దిశానిర్దేశం చేశారు.
కూటమి సంఖ్య బలం పెరిగే సూచనలు: మేయర్, డిప్యూటీ మేయర్లు మినహాయించి ఇప్పటికే ఇద్దరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు క్యాంపునకు వెళ్లకుండా విశాఖలోనే ఉండటంతో కూటమి సంఖ్య బలం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మేయర్ అవిశ్వాస పరీక్షకు మూడింట రెండో వంతు సభ్యుల బలం అవసరం. కాగా కూటమికి 12 మంది ఎక్స్ఆఫీషియో సభ్యులు బలంతో పాటు కార్పొరేటర్లు 60 మంది వరకు ఉండటంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. సీపీఐ, సీపీఎం సభ్యులు అవిశ్వాస పరీక్షకు దూరంగా ఉంటామనే సంకేతాలిచ్చారు.
"క్యాంప్ రాజకీయాలకు దూరంగా ఉంటామని జనసేన పార్టీ ముందే చెప్పింది. కూటమి ప్రభుత్వంలో భాగంగా పార్టీ పెద్దలు చెప్పిన దానికి కట్టుబడి ఉంటాము. మేయర్ అవిశ్వాస తీర్మానంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా జనసేన సభ్యులు నడుకుచుంటారు". - పీతల మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్
విశాఖలో వేడెక్కిన రాజకీయం - మేయర్‌పై అవిశ్వాసానికి సిద్ధమైన కూటమి నేతలు