Main Accused Arrested Fake Currency Case : దొంగ నోట్ల ముఠాలోని ప్రధాన నిందితుడిని ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల పోలీసులు అడుపులోకి తీసుకున్నారు. ద్వారకాతిరుమల మండలం తూర్ల లక్ష్మీపురానికి చెందిన కోడూరి రవితేజ ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో నివాసముంటూ కొంత మందితో ముఠాగా ఏర్పడి దొంగ నోట్లు చలామణికి పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో ద్వారకాతిరుమలలో రోడ్డు పక్కన హోటల్ నిర్వహిస్తున్న కొల్లి సుబ్రహ్మణ్యం, ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.65 లక్షల నకిలీ నోట్లతో పాటుగా పెద్ద మొత్తంలో సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో పలు కేసుల్లో ముద్దాయి: ఈ సందర్భంగా శనివారం భీమడోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి రెండో తేదీన ద్వారకాతిరుమలలో దొంగ నోట్లు మారుస్తున్న ఒక ముఠాను అరెస్ట్ చేశామన్నారు. ఆ ముఠాలో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజ పరారీలో ఉన్నాడని, అప్పటి నుంచి అతని కోసం ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు అతడ్ని అరెస్ట్ చేశామన్నారు.
ఇతను గతంలో పలు కేసులలో ముద్దాయిగా కూడా ఉన్నాడని డీఎస్పీ వెల్లడించారు. ఇతని వద్ద నుంచి రూ.65 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఉంగరం, రెండు ముక్కు పుడకలు, నల్లపూసల గొలుసు, వెండి స్పూను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో భీమడోలు సీఐ యుజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్, భీమడోలు ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
"గతంలో దొంగనోట్లు మారుస్తూ పట్టుబడిన ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజ ప్రజలను మోసం చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడని సమాచారం మేరకు అతడ్ని అరెస్ట్ చేశాం. ఈ కేసులో ప్రతిభ చూపినటువంటి భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్, ద్వారకాతిరుమల ఎస్సై, భీమడోలు ఎస్ఐ వారి సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాం." - ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్
దొంగ నోట్ల మార్పిడి- ముఠా అరెస్ట్!
రూ. 2లక్షలకు 10లక్షల విలువైన నకిలీ నోట్లు- ఫేక్ ప్రింటింగ్ ప్రెస్ గుట్టురట్టు