Madhavaram People in Military : నవమాసాలు మోసి పురిటి నొప్పులను పంటిబిగువన భరించి బిడ్డకు జన్మనిచ్చావు. ఉగ్గుపాలతో పాటు దేశ భక్తిని నింపావు. బాల్యంలో ధైర్యసాహసాలు నేర్పించావు. పిల్లలు సైన్యంలోకి వెళ్తామంటే చిరునవ్వుతో అంగీకరించావు. మీ పిల్లలు సరిహద్దులో భరతమాతకు రక్షణగా ఉంటూ కోట్లాది మంది అమ్మలకు భరోసానిస్తున్నారని తెలిసి ఉప్పొంగిపోయావు. ఆపరేషన్ సిందూర్ ఉద్రిక్త పరిస్థితుల్లో సరిహద్దు ప్రాంతాల్లో కాపలా కాస్తున్న బిడ్డలకు ఏమీ కాదంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అంతర్లీనంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నావు. కానీ ఇదంతా దేశం కోసమేనని సర్దిచెప్పుకొంటూ ముందుకు సాగుతున్న మాధవరానికి చెందిన సైనికుల ధీర మాతృమూర్తుల మనోభావాలివి.

గర్వంగా ఉంది : తనకు ఇద్దరు కుమారులని పద్మావతి భూరామణి తెలిపారు. పెద్ద అబ్బాయి వీరవెంకట సత్యనారాయణ సైన్యంలో సేవలందించి ఉద్యోగ విరమణ చేశారని చెప్పారు. రెండోవాడు వెంకట శ్రీనివాస్ దేశ సరిహద్దుల్లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలూ దేశం కోసం పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌పై పోరులో రెండో కుమారుడు భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని అంగిన ఆమె వెల్లడించారు.
విజయం మనదే : తన కుమారుడు సూరిబాబు 17 సంవత్సరాలుగా సైనికుడిగా పనిచేేస్తున్నట్లు రేలంగి పుణ్యవతి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ సరిహద్దు ప్రాంతంలోనే విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. యుద్ధం వస్తే అబ్బాయికి ఏమవుతుందోనన్న ఆందోళన ఉన్నా మరోవైపు దేశం కోసం పోరాడుతున్నాడన్న సంతోషం ఎక్కువగా ఉందన్నారు. యుద్ధంలో విజయం సాధించి ఇంటికొస్తాడన్న నమ్మకం ఉందని రేలంగి పుణ్యవతి ధీమా వ్యక్తం చేశారు.

ఉద్వేగంతో ఉన్నా : తన కుమారుడు షేక్ హలీబ్ 10 సంవత్సరాలుగా దేశ సరిహద్దుల్లో సైనికుడిగా పని చేస్తున్నట్లు షేక్ నూర్జహాన్ వివరించారు. సైన్యంలో చేరిన తొలినాళ్లలో భయంగా ఉండేదన్నారు. ఏ సమయంలో ఏమవుతుందోనని ఆందోళన చెందేదాణ్ని. పాకిస్థాన్, ఉగ్రవాదుల కవ్వింపు చర్యలకు తాను ఉద్వేగానికి గురవుతున్నట్లు వాపోయారు. తన కుమారుడు వీరోచితంగా పోరాడి దేశానికి, గ్రామానికి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు షేక్ నూర్జహాన్ పేర్కొన్నారు
ఇంట్లో వారంతా జవాన్లే : ‘నా భర్త భూరయ్య విశ్రాంత సైనికుడు. నా కుమారుడు నాగేంద్రబాబు దేశ సరిహద్దులో జవాన్‌గా సేవలందిస్తున్నారు. నా ఇద్దరు అల్లుళ్లు సైనికులుగా పని చేస్తున్నారు. ఇండియా- పాకిస్థాన్ యుద్ధంలో కొడుకు, అల్లుళ్లు పాల్గొనడం సంతోషంగా ఉంది. పాక్ కొమ్ములు విరిచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని దేవన సాయికుమారి తెలియజేశారు.
స్వగ్రామంలో వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి
సరిహద్దుల్లో బాంబుల మోత - స్వస్థలాలకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు