Today Weather Update in Andhra Pradesh: దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది మంగళవారం వరకు వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని ఆ తరువాత 48 గంటల్లో ఉత్తర దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉందన్నారు.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం, బుధవారం అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేడటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉత్తర కోస్తా, యానాంలో రాబోయే 4 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగి, ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతాయని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో గరిష్ఠంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగి, ఆ తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశముంది.
పిడుగులు పడే అవకాశం: రాబోయే 3 గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గోడ కూలి ఒకరు మృతి : ఎన్టీఆర్ జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. విజయవాడ, తిరువూరు, కంచికచర్ల, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జి.కొండూరు మండలం పినపాక వెళ్లే దారిలో ఈదురు గాలులకు గోడ కూలింది. ఈ ప్రమాదంలో గోడ పక్క నుంచి వాకింగ్ చేస్తున్న మంగారావు అనే ఆర్టీసీ కండక్టర్ మృతి చెందారు.
రైతుల అవస్థలు : ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. గాలులు, వర్షంతో గుంటూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లాలో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలుల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లోని మిరప, మెుక్కజొన్న, పెసర పంటలను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం - నాలుగు రోజుల పాటు వర్షాలు
ఈ రోజు ఉష్ణోగ్రతలు (డిగ్రీలలో): నంద్యాలలో 41.5, కర్నూలు జిల్లా నడిచాగిలో 41.1, వైఎస్సార్ జిల్లా బలపనూరులో 41, ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 40.8, తిరుపతి జిల్లా గూడూరు, విజయనగరం జిల్లా నెలివాడలో 40.6, చిత్తూరు జిల్లా నగరిలో 40.5, అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె 40.4, పల్నాడు జిల్లా రావిపాడులో 40 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. వైఎస్సార్ జిల్లాలో 14, నంద్యాల జిల్లాలో 10చోట్ల, ఇతర జిల్లాల్లో 15, మొత్తంగా కలిపి 39 చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు పిడుగులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు నమోదు అయ్యాయి. కృష్ణా గుంటూరు, పలనాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం నమోదు అయ్యింది. ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగిపడ్డాయి.