ETV Bharat / state

రాత్రి పూట కునుకు పట్టనివ్వని శబ్దాలు - గుండె వేగం, రక్తపీడనం పెరుగుతుందంటున్న వైద్యులు

ప్రాణాలు తీస్తున్న భారీ శబ్దాలు - బ్రెయిన్‌స్ట్రోక్, శాశ్వత వినికిడి లోపం తలెత్తే ప్రమాదం - హృద్రోగులు, వృద్ధులు దూరంగా ఉండాలంటున్న వైద్యులు

SOUND POLLUTION
SOUND POLLUTION (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : September 2, 2025 at 4:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

Sound Pollution In Hyderabad : హైదరాబాద్​ నగరంలోని నివాసిత ప్రాంతాల్లో రాత్రి సమయంలో పరిమితికి మించి శబ్దకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. సున్నిత, నివాస ప్రాంతాల్లో శబ్దాలు ప్రశాంతంగా నిద్ర పోదాం అనుకుంటే కునుకు పట్టడం కష్టతరంగా మారింది.

కారణాలు ఇవీ

  • వాహనాలకు భారీ శబ్దాలు వచ్చే హారన్లు, సైలెన్సర్లు ఉండటం
  • అడ్డూ అదుపు లేని ట్రావెల్‌ బస్సుల హారన్ల భారీ శబ్దాలు

నష్టాలు తెలుసా?

  • మనిషిలో వినికిడి లోపం తగ్గడంతో పాటు ఏకాగ్రతకు దెబ్బ
  • గుండె కొట్టుకునే వేగం, రక్తపీడనం (బీపీ) పెరుగుతుంది.
  • 65 డెసిబుళ్ల చప్పుడు మీరితే గుండె జబ్బులు, చెవుడు వచ్చే అవకాశం వస్తుంది.
  • నిద్రలేమి, తలనొప్పితో అలసట రావడం, శారీరక శక్తిని కోల్పోవటం

స్వీయ జాగ్రత్తలు తీసుకోండిలా..

  • ఇయర్‌ ప్లగ్స్‌ లేదా నాయిస్‌ క్యాన్సలింగ్‌ హెడ్‌ఫోన్స్‌ ఉపయోగించడం వల్ల జాగ్రత్తపడొచ్చు.
  • కిటికీలకు మందపాటి తెరలు, శబ్దాన్ని గ్రహించే డబుల్‌ గ్లేజ్డ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి.
  • గోడలకు శబ్దాన్ని తగ్గించే ప్యానెల్స్‌ లేదా అకౌస్టిక్‌ ఫోమ్‌ ఏర్పాటు చేసుకుంటే మంచిది.
  • ఒత్తిడి, ఆందోళన తగ్గేందుకు ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు చేయాలి.

పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​ లెక్కల ప్రకారం : రాత్రిపూట ధ్వని 40 డెసిబుళ్ల కంటే తక్కువగా ఉండాలి.

ఆగస్టు నివేదిక ప్రకారం

నమోదైంది (డెసిబుల్స్​లో)

జూబ్లీహిల్స్​55
తార్నాకా58
జూపార్కు68
గచ్చిబౌలి54

డీజేల్లో 200 డెసిబుల్స్​ పైగా శబ్ధం : ఇళ్లలో సాధారణంగా 30 నుంచి 40 డెసిబుల్స్‌ మధ్య శబ్దం ఉంటుంది. బయట 50 నుంచి 60 డెసిబుల్స్ ఉంటుంది. దీనివల్ల మనిషికి ఎలాంటి నష్టమూ ఉండదు కానీ ట్రాఫిక్‌ సిగ్నళ్లు, జంక్షన్ల వద్ద 60 నుంచి 80 డెసిబుల్స్‌ శబ్దాలు వినిపిస్తాయి. ఇక్కడ ఎక్కువ సమయం గడిపితే క్రమంగా చెవి సమస్యలు సంక్రమించే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డీజేల్లో 200 డెసిబుల్స్‌కు పైగా సౌండ్​ ఉంటుంది.

చెవిలోని కాక్లియర్‌లోని వెంట్రుకలతో ఉండే సున్నితమైన సెల్స్​ దెబ్బతింటాయి. అవి పూర్తిగా దెబ్బతింటే శాశ్వతంగా వినికిడి లోపం వస్తుంది. పాక్షికంగా దెబ్బతింటే కొద్ది రోజులు ఏమి వినపడవు. ఈ సమస్య నుంచి కొంతకాలం తర్వాత నెమ్మదిగా కోలుకోవచ్చు. భారీ శబ్దాల వల్ల చిన్న పిల్లల చెవుల్లోని పలుచని అంతర పొరలు చిట్లిపోయి వినికిడి లోపం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వారిని భారీ శబ్దాలకు దూరంగా ఉంచడమే ఉత్తమం.

గర్భిణులకు ప్రమాదకరం : భారీ శబ్దాలు గర్భిణులపై ప్రభావం చూపుతాయని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. శబ్ద కాలుష్యం వల్ల ప్రెగ్నెంట్​ మహిళలకు అబార్షన్‌ అయ్యే అవకాశాలూ ఉన్నాయని, 85 డెసిబుల్స్‌ శబ్దం మించితే గర్భిణులకు అత్యంత ప్రమాదకరమని ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ నయన తెలిపారు. మనకు వినిపించే శబ్దాలన్నీ గర్భంలోని శిశువుకు కూడా వినిపిస్తాయని, వాటి వల్ల మనకు గుండె దడ వచ్చినట్లే శిశువుకూ వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. కొన్నిసార్లు నెలలు నిండకముందే డెలివరీ అవ్వొచ్చు. తల్లి అధిక శబ్దాలు వినడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుడతారని, వారికి ఎదుగుదల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. గర్భం దాల్చిన 4వ నెల నుంచి భారీ డీజే శబ్దాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

శబ్దం మితంగా ఉంటే ఆహ్లాదం - మితిమీరితే హానికరం