Loan for Indiramma Housing Scheme Beneficiaries : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా పలువురు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. అలాంటి వారికి స్వశక్తి సంఘాల నుంచి లోన్లు ఇప్పించేందుకు యంత్రాంగం సమాయత్తమవుతోంది.
ఇవీ కారణాలు : లబ్ధిదారుడు సొంత ఖర్చులతో తన స్థలంలో పునాదులు తీసి బేస్మెంట్ వరకు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే లబ్ధిదారుడి బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వం రూ.లక్ష జమ చేస్తుంది. మెజారిటీ లబ్ధిదారులకు డబ్బులు లేక నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు. పూరి గుడిసెలు, షెడ్లలో నివాసముంటున్న కొంతమంది లబ్ధిదారులు వాటిని తొలగించి ఇళ్లు నిర్మించాలి. మరికొందరు సర్కారు నిర్దేశించిన రూల్స్నకు అనుగుణంగా నిర్మించుకునేందుకు సిద్ధంగా లేర
ఈ విధంగా పలు కారణాలతో జిల్లాలో ఆశించిన స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఏప్రిల్ నెలాఖరులోగా కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వశక్తి సంఘాల్లో సభ్యులైనటువంటి లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాల నిమిత్తం లోన్లు అందించేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది.
దరఖాస్తు చేసుకుంటే రుణం : ఇంటి నిర్మాణంలో పునాదుల వరకు వెచ్చించనున్న వ్యయం నిమిత్తం స్వశక్తి సంఘాల నుంచి అర్హులైన లబ్ధిదారులకు రూ.లక్ష రుణాన్ని ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇంటి నిర్మాణం ప్రారంభించే లబ్ధిదారులు స్వశక్తి సంఘంలో సభ్యులై ఉండి దరఖాస్తు చేసుకుంటే గ్రామైక్య సంఘం లేదా మండల, జిల్లా సమాఖ్యల ద్వారా లోన్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. రోజువారీగా సమీక్షించి ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పనులు చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామని ఇన్‌ఛార్జి అదనపు పాలనాధికారి చందర్‌నాయక్ వెల్లడించారు. నిరుపేదలైన లబ్ధిదారులకు స్వశక్తి సంఘాల నుంచి రుణసాయాన్ని అందించాలని నిర్ణయించినట్లుగా ఆయన పేర్కొన్నారు.
వారికే ఇళ్లు కేటాయించండి - ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇళ్లు - ఈ కొలతల్లో కడితే రూ.5 లక్షలకు రూపాయి దాటదు!