Smart Phone Users Are Depending on Power Banks : సెల్‌ఫోన్ నిత్య జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది అనడంలో సందేహం లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా, లావాదేవీలు జరపాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా తప్పనిసరి. సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ అవుతుందంటే టెన్షన్ పడటం సహజం. స్మార్ట్‌ఫోన్‌ను ఎవరూ వస్తువులా చూడరు. క్యాలెండర్, మ్యాప్స్, ఈ-వ్యాలెట్స్, సోషల్ మీడియాతో పాటు హెల్త్ ట్రాకర్లు, ఆఖరికి గుర్తింపు కార్డులు సైతం అన్నింటికీ చరవాణినే వాడుతున్నాం. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ 20 శాతం కంటే తగ్గితే సుమారు 90 శాతం మంది ఒత్తిడికి గురవుతున్నారని ‘ఎల్‌జీ గ్లోబల్’ అధ్యయనంలో గుర్తించింది. ఎక్కువగా యువ ఉద్యోగులు, ప్రయాణికులు, ఆన్‌లైన్ లావాదేవీలు చేసేవారు అధికంగా ఉన్నట్లు పేర్కొంది.
- సిద్ధార్థ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పనిమీద అనుకోకుండా విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. ప్రయాణ హడావుడిలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం మరిచిపోయాడు. క్రమంగా ఫోన్‌లో ఛార్జింగ్ తగ్గుతూ వస్తోంది. అతను కూర్చున్న సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్ పని చేయడం లేదు. విజయవాడ చేరుకోక ముందే 20 శాతానికి పడిపోయింది. ఎక్కడ స్విచ్‌ఆఫ్ అవుతుందోనని అతనికి టెన్షన్ పెరిగిపోయింది. విజయవాడలో దిగగానే మొబైల్ షాప్‌లో ఫోన్ ఛార్జింగ్ చేసుకున్న తర్వాతే అతను కుదుటపడ్డాడు.
స్విచ్‌ఆఫ్ అయితే ఇంకా అంతే : భారత్‌లో స్మార్ట్‌ఫోన్ రోజుకు ఒకవ్యక్తి సగటున 4.9 గంటలు వాడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని 68 శాతం మంది తప్పనిసరిగా పవర్ బ్యాంకును వెంటబెట్టుకుంటున్నారు. 70 శాతం మంది యువత ఇన్ బిల్ట్ ఛార్జింగ్ పోర్టళ్లు ఉన్న వస్తువులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. 60 శాతం మంది యువ ఉద్యోగులు తమ ఫోన్ స్విచ్‌ఆఫ్ అయితే అభద్రతగా భావిస్తున్నారు.
ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు బ్యాగులో పెన్ను, పుస్తకాలు, ఇయర్‌ఫోన్, అమ్మాయిలైతే మేకప్ కిట్, ఫోన్, పర్సు, తాళంతో పాటూ పవర్‌బ్యాంకునూ తీసుకెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతోపాటు అదనపు ఛార్జర్లు, మల్టీ పర్పస్ అడాప్టర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ వెంట పెట్టుకుంటున్నారు. ఈ మధ్య వస్తున్న బ్యాగులకు యూఎస్‌బీ పోర్టులు ప్రత్యేకంగా పెట్టుకోవడానికి కూడా ప్రత్యేక స్థానం కేటాయిస్తున్నారంటే వాటికి ప్రస్తుత యువత ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందా? - మీ ఫోన్లోనే రెన్యూవల్ చేసుకోండి ఇలా
మీ ఫోన్ ఒరిజినలా? - డూప్లికేట్ పీస్?? - ఇలా క్షణంలో తెలుసుకోండి!