Leopards Killed In Road Accidents Nizamabad District : అడవుల్లో సంచరించాల్సిన చిరుత పులులు జనావాసాల్లోకి వస్తున్నాయి. రాత్రి సమయాల్లో రహదారులపై సంచరిస్తూ ప్రమాదాల బారినపడుతున్నాయి. భారీ వాహనాలు ఢీకొని ఒక్కొక్కటిగా మృత్యువాతపడున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అడవుల్లో నీటి,ఆహార అవసరాలను తీర్చాల్సిన అధికారుల నిర్లక్ష్యం వన్యప్రాణుల పాలిట శాపంగా మారుతోంది.
తరుచూ జనావాసాల్లోకి : చిరుత పులుల సంరక్షణ పట్ల అటవీశాఖ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అడవుల నుంచి చిరుతలు బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులులు తరుచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. రహదారులపై సంచరిస్తున్నక్రమంలో వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నాయి.
రెండేళ్ల చిరుత మృత్యువాత : ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. చిరుతల సంఖ్య పెరగడంతో అడవిని ఆనుకొని ఉన్న ప్రాంతాలకు అవి వస్తున్నాయి. వాటిని చూసిన స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల చిరుత మృత్యువాతపడింది. 2018 నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగు చిరుతలు ప్రాణాలు కోల్పోగా మరికొన్ని గాయాలపాలయ‌్యాయి. అడవుల్లో కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకపోవడంవల్లే అవి బయటికొస్తున్నాయనే అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది.
నిజామాబాద్, ఆర్మూర్ అటవీ డివిజన్లలో 86 వేల హెక్టార్లలో అటవి విస్తరించి ఉంది. ఇందులో నిజామాబాద్ ఉత్తరం, దక్షిణం, ఇందల్వాయి, ఆర్మూర్, కమ్మర్‌పల్లి , సిరికొండ, వర్ని రేంజ్‌లున్నాయి. నిజామాబాద్ ఉత్తర, దక్షిణం, ఇందల్ వాయి రేంజ్ పరిధిలో 44వ జాతీయ రహదారిపై చిరుతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో శివారు ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఇందల్వాయి రేంజ్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపైన ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.
అధికారులు విఫలం : వన్యప్రాణులు అడవిని విడిచి జాతీయ రహదారిపైకి రాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు. ఆహార అవసరాలకు అనుగుణంగా గడ్డి క్షేత్రాలను అభివృద్ధి చేయలేకపోతున్నారు.ఫలితంగా చిరుత పులులు జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారుతోంది. అడవుల్లో వాటికి కావాల్సిన సదుపాయాలు కల్పించి చిరుతలను బయటికిరాకుండా చూడాలని స్థానికులు అంటున్నారు. రహదారికి ఇరువైపులా రక్షణ కంచెను ఏర్పాటుచేసి వన్యప్రాణులకు సహా తమకూ రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
కంచెను ఏర్పాటుచేస్తే : అడవుల్లో వన్యప్రాణులకు కావాల్సిన నీటి సౌకర్యం పుష్కలంగా ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఆహారంకోసం అవి బయటకు రావడంవల్లే తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని అంటున్నారు. అండర్‌పాస్ నిర్మాణంకై ఎన్‌హెచ్ఏఐ అధికారులకు లేఖ రాసిన పట్టించుకోవట్లేదని, కనీసం రక్షణ కంచెను ఏర్పాటుచేస్తే ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు.
మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన చిరుత - హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
అర్థరాత్రి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కలకలం -ఏంటా అని చూసి ఖంగుతున్న సెక్యూరిటీ